Minister Nara Lokesh: ఎస్కేయూ లో అవకతవకలపై విచారణ కమిటీ ఏర్పాటు: మంత్రి నారా లోకేశ్ ప్రకటన
విచారణ కమిటీ ఏర్పాటు: మంత్రి నారా లోకేశ్ ప్రకటన
Minister Nara Lokesh: అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో 2019-24 మధ్య జరిగిన అక్రమాలపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శాసనసభలో తెలిపారు. కంప్యూటర్ల కొనుగోలులో దుర్వినియోగం, యూనివర్సిటీ వాహనాలను వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించడం, నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు, నియామకాలు, రిక్రూట్‌మెంట్‌లో రూల్స్ ఆఫ్ రిజర్వేషన్‌ను పాటించకపోవడం వంటి అంశాలపై కమిటీ వేసి, 100 రోజుల్లో నివేదిక తెప్పించి చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు.
ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, పల్లె సింధూర రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. పారదర్శకంగా విశ్వవిద్యాలయాలను నిర్వహించాలనే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని లోకేశ్ తెలిపారు. గురువారం ఆంధ్రా యూనివర్సిటీలో ఒక విద్యార్థి ఫిట్స్‌తో మరణించాడని, దీనిపై కొన్ని విద్యార్థి సంఘాలు ఆందోళన చేయడం సరికాదని అన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి తప్పు లేకుండానే రాజకీయాలు చేయడం సరికాదని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా యూనివర్సిటీ వీసీలను నియమిస్తున్నామని తెలిపారు. ఆంధ్రా యూనివర్సిటీని టాప్-100 విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా తీర్చిదిద్దే బాధ్యతను ముఖ్యమంత్రి తనకు అప్పగించారని పేర్కొన్నారు. కొంతమంది స్వార్థం కోసం విశ్వవిద్యాలయాల్లో గొడవలు సృష్టించడం బాధాకరమని అన్నారు.
పాలిటెక్నిక్ కళాశాలలకు కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు
రాష్ట్రంలో భవనాలు లేని పాలిటెక్నిక్ కళాశాలలకు కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు మంత్రి నారా లోకేశ్ శాసనసభలో తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు కళాశాలల భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. చోడవరం, పొన్నూరు, బేతంచర్ల, మైదుకూరు, గుంతకల్లు కళాశాలలకు భూములు కేటాయించామని, మచిలీపట్నం, కేఆర్ పురం, అనపర్తిలో త్వరలో కేటాయిస్తామని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎంపీ లాడ్స్, సీఎస్ఆర్ నిధులను అనుసంధానం చేసి సొంత భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. పాలిటెక్నిక్‌లలో అడ్మిషన్లు 70 శాతం మాత్రమే ఉన్నాయని, కన్వెన్షనల్ కోర్సులకు ఆసక్తి తగ్గడంతో వాటిని రీడిజైన్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.