Pemmasani Chandrasekhar : అమరావతికి రానున్న ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి;
పది ఎకరాల విస్తీర్ణంలో అద్భుత సదుపాయాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం
అమరావతిని ఆర్థిక, వ్యాపార అభివృద్ధి రంగాల్లో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే దిశగా మరో మహత్తర ప్రాజెక్టు త్వరలో రూపుదిద్దుకోనుంది. హడ్కో ఆధ్వర్యంలో 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోయే హడ్కో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ రాష్ట్రానికే గర్వకారణంగా నిలవనుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో ఓ ప్రకటన విడుదల చేశారు. భూసేకరణలో భాగంగా హడ్కో బోర్డుకు పది ఎకరాలను ఆమోదించగా, అందులో 8 ఎకరాలకు ఏపీ సీఆర్డీఏ నుంచి ఇప్పటికే ప్రాథమిక ఆమోదం లభించిందని పెమ్మసాని చెప్పారు. మిగిలిన రెండుఎకరాల ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోందన్నారు. ఢిల్లీలోని ఇండియా హాబిటాట్ సెంటర్ స్థాయిలో నిర్మించబడబోయే ఈ కాంప్లెక్స్‌లో హడ్కో కార్యాలయాలు మాత్రమే కాకుండా, హౌసింగ్ , అర్బన్ డెవలప్మెంట్ రంగాలకు శిక్షణా సదుపాయాలు కూడా అందుబాటులోకి రానున్నాయని కేంద్ర సహాయ మంత్రి వివరించారు.
అత్యంత ఆధునికంగా, ప్రపంచ స్ధాయి ప్రమాణాలతో నిర్మించే ఈ కన్వెన్షన్ సెంటర్లో రెండు వేల మంది సామర్థ్యం గల ఆధునిక ఆడిటోరియం ఉంటుందని, విజువల్ ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేస్తారని పెమ్మసాని తెలిపారు. అలాగే అతిథి గృహాలు, హోటల్, ఇండోర్, ఔట్ డోర్ రెస్టారెట్లు, అన్ని రకాల హంగులతో ప్రత్యేక కల్చరల్ ఆర్ట్ గ్యాలరీలు, సాంస్కృతిక వేదికలు ఏర్పాటు చేసేలా ఈ కన్వెన్ సెంటర్ రూపకల్పన చేస్తున్నట్లు పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. అదూ విధంగా సకల సదుపాయాలతో కూడిన సెక్రటేరియట్ డాక్యుమెంటేషన్ సెంటర్ కూడా ఉంటుందని చెప్పారు. వీటితో పాటు స్విమ్మింగ్ పూల్, ఎగ్జిబిషన్ హాల్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ హడ్కో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ అమరావతిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఫైనాన్స్, వనరులు, నైపుణ్యాల సమాహార కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు పెమ్మసాని చెప్పారు.
ఇంత పెద్ద ప్రాజెక్టు సాకారం కావడానికి సహకరించిన కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ఐటీ,విద్యా శాఖల మంత్రి నారా లోకేష్, అలాగే దేశ అభివృద్ధి దిశగా మార్గనిర్దేశం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.