Cyclone Murasu: మురసు తీవ్ర తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైఅలర్ట్‌గా ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్షలు నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.

పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో సమీక్షించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని, అత్యంత భారీ వర్షాల హెచ్చరికలు ఉన్న ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వాగులు, వంకల సమీపంలో జన సంచారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాగునీరు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలను వీలైనంత త్వరగా పునరుద్ధరించేలా సమన్వయం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. తుపాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని కోరారు.

మరోవైపు హోం మంత్రి వంగలపూడి అనిత తుపాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈరోజు, రేపు రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అర్ధరాత్రి-తెల్లవారుజాము సమయంలో ఒంగోలు సమీపంలో తుపాన్ తీరం దాటే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపినట్లు మంత్రి పేర్కొన్నారు. దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల కలెక్టర్లు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కృషి చేయాలని సూచించారు.

ఎలక్ట్రికల్ లైన్ల మీద చెట్లను ముందుగానే తొలగించాలని, విద్యుత్, నెట్‌వర్క్ సమస్యల తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. మత్స్యకారుల బోట్లు, వలలు సురక్షితంగా ఉంచుకునేలా అలర్ట్ చేయాలని కోరారు. అధికార యంత్రాంగం 48 గంటల పాటు హైఅలర్ట్‌గా ఉండాలని, తుపాన్‌ను ఎదుర్కోడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ఈదురుగాలులకు తెగిన విద్యుత్ వైర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సూచించారు.

ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని, అధికారిక హెచ్చరికలు తప్పనిసరిగా పాటించాలని, వదంతులు నమ్మవద్దని మంత్రి అనిత కోరారు. తుపాన్ సమస్యలకు మనమిత్ర వాట్సాప్ 9552300009 ద్వారా తక్షణ పరిష్కారం చూపనున్నట్లు, అత్యవసర సహాయం కోసం 112, 1070, 18004250101 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.

Tags: