Jagan: అవిశ్వాసంతో పదవులు కోల్పోయిన వారికి జగన్ మరో అవకాశం
మరో అవకాశం
Jagan: అవిశ్వాసం కారణంగా గతంలో మేయర్, ఛైర్మన్ పదవులు కోల్పోయిన వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి అవకాశం ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అయితే మొదటి నుంచీ పార్టీలో విధేయంగా కొనసాగుతున్న వారికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.
మంగళవారం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో జగన్ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులతో జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించారు. ఈ చర్చల్లో వివిధ కార్పొరేషన్లకు రిజర్వేషన్ల ప్రకారం మేయర్ అభ్యర్థుల జాబితా సిద్ధం చేశారు. కూటమి అభ్యర్థులు ఎవరుంటారనే విషయంపై స్పష్టత వచ్చాక రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని వైకాపా తరఫున బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని జగన్ సూచించారు.
‘అన్ని అంశాలపై ప్రాంతీయ సమన్వయకర్తలు ఎప్పటికప్పుడు స్పందించాలి. అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల పర్యవేక్షకులు స్థానికంగా అందుబాటులో ఉండాలి. ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లడంతోపాటు పార్టీ న్యాయ విభాగాన్ని అప్రమత్తం చేసి కోర్టులను ఆశ్రయించాలి’ అని జగన్ సూచించారు.
బుధవారం జగన్ విజయనగరం జిల్లా భోగాపురంలో పర్యటించనున్నారు. అక్కడ వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉప్పాడ శివారెడ్డి వివాహ కార్యక్రమానికి హాజరవుతారు.