Viveka Murder Case: వివేకా హత్య కేసు: రూ.40 కోట్ల సుపారీ డీల్పై ఈడీ విచారణకు హాజరైన కడప ఎంపీ అవినాశ్ రెడ్డి
కడప ఎంపీ అవినాశ్ రెడ్డి
Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మనీలాండరింగ్ కోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు మరింత ముమ్మరం చేసింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైఎస్సార్సీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి బుధవారం హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
న్యాయవాదితో కలిసి వచ్చిన అవినాశ్ రెడ్డి, 2019 నుంచి తన బ్యాంకు లావాదేవీల స్టేట్మెంట్లను ఈడీ అధికారులకు అందజేశారు. హత్యకు సంబంధించి రూ.40 కోట్ల సుపారీ ఒప్పందం, నగదు బదిలీలు, ఆధారాలు చెరిపేసిన అంశాలపై అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
సీబీఐ చార్జ్షీట్ల ఆధారంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద ఈడీ ఈ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్రగంగి రెడ్డి, సునీల్ యాదవ్, అప్రూవర్గా మారిన దస్తగిరి తదితరులను ఈడీ విచారించింది. హత్య కోసం రూ.40 కోట్ల డీల్ కుదిరిందని, అందులో భాగంగా కొంత నగదు చేతులు మారిందని అప్రూవర్ దస్తగిరి, సునీల్ యాదవ్ వాంగ్మూలాలు ఇచ్చినట్లు సమాచారం.
గత ఆగస్టులో ఈడీ అవినాశ్ రెడ్డి కోకాపేట విల్లా సహా హైదరాబాద్, కడప జిల్లాలోని అనేక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి రూ.24 లక్షల లెక్కల్లో చూపని నగదు, బ్యాంక్ లాకర్ కీలు, కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. హత్యకు ముందు, తర్వాత జరిగిన ఆర్థిక లావాదేవీలు, నిధుల మూలాలపై ఈడీ ప్రత్యేక దృష్టి సారించింది.
వివేకా హత్య కేసులో మనీ ట్రయిల్పై ఈడీ దర్యాప్తు కొనసాగుతుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.