Janasena Leader Arrest : హత్య కేసులో జనసేన నేత కోట వినూత అరెస్ట్
వినూతతో పాటు ఆమె భర్తను కూడా అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు;
జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇంఛార్జ్ కోట వినూతను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె మాజీ డ్రైవర్ శ్రీనివాసరాయుడు హత్య కేసులో వినూతతో పాటు ఆమె భర్త కోట చంద్రబాబు, మరో ముగ్గురు వ్యక్తులను చెన్నై పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు. చెన్నై మింట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కూవం నదిలో మూడు రోజుల క్రితం ఒక గుర్తు తెలియని శవాన్ని కనుగొన్నారు. ఆ శవం చేతి మీద జనసేన గుర్తుతో పాటు వినూత పేరు ఉండటంతో ఆ దిశగా చెన్నై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంతో శ్రీకాళహస్తి జనసేన ఇంఛార్జ్ వినూత అమె భర్త చంద్రబాబులను పోలీసులు విచారించారు. ఈ విచారణలో మృతుడు శ్రీనివాసులు ఉరఫ్ రాయుడు వినూత మాజీ డ్రైవర్ గా గుర్తించారు. ఈ నెల 8వ తేదీన డ్రైవర్ రాయుడిని హత్య చేసి చెన్నై తీసుకు వెళ్లి నదిలో పడేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో వినూత, ఆమో భర్త చంద్రబాబులతో పాటు మిగితా ముగ్గురు నిందితులను శ్రీకాళహస్తి తీసుకు వచ్చిన పోలీసులు అన్ని రకాలుగా విచారణ జరుపుతున్నారు.
ఇదిలా ఉండగా శ్రీకాళహస్తి సమీపంలోని బొక్కసంపాలెం గ్రామానికి చెందిన సీహెచ్.శ్రీనివాసులు కొంత కాలంగా జనసేన నాయకురాలు వినూత వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆమె దగ్గర నమ్మిన బంటులా ఉంటూ వ్యక్తిగత సహాయకుడిగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో ఏమైందో ఏమో రెండు వారాల క్రితం వినూత డ్రైవర్ రాయుడిని విధుల నుంచి తొలగించారు. అంతటితో ఊరుకోకుండా ఆ విషయాన్ని బహిరంగ ప్రకటన కూడా చేశారు. శ్రీనివాసులు చేసిన ద్రోహానికి అతన్ని డ్రైవర్ గా తొలగిస్తున్నట్లు ఇకపై శ్రీనివాసులకి తనకూ ఏటువంటి సంబంధం లేదని పత్రికా ప్రకటనతో పాటు సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టారు. అయితే వినూత మాజీ డ్రైవర్ శ్రీనివాసులు హత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.