AP State Minister Lokesh: ఓడరేవుల అభివృద్ధికి జపాన్ సహకారం- రాష్ట్ర మంత్రి లోకేశ్
రాష్ట్ర మంత్రి లోకేశ్
AP State Minister Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో ఓడరేవుల ఆధారిత మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇంధన భద్రత, ఇతర రంగాల్లో నిధుల సమకూర్చడంతో పాటు విదేశీ పెట్టుబడులను సులభతరం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ (జేబీఐసీ)ను రాష్ట్ర మంత్రి లోకేశ్ కోరారు. జేబీఐసీ ఎగ్జిక్యూటివ్ ఎండీ హషియామా షిగెటోతో ఆయన సమావేశమయ్యారు.
సమావేశంలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, షిప్ బిల్డింగ్, సెమీకండక్టర్లు, ఆటోమొబైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, పారిశ్రామిక తయారీ రంగాల్లో జపాన్ పెట్టుబడులకు మార్గనిర్దేశం చేయడంలో సహకరించాలని కోరారు. రాష్ట్రంలో మూలపేట, మచిలీపట్నం, దుగరాజపట్నంలో ఏర్పాటవుతున్న నౌకానిర్మాణ క్లస్టర్లలో పెట్టుబడులకు జపాన్ నౌకా నిర్మాణం, మారిటైమ్ ఇంజినీరింగ్ కంపెనీలను ప్రోత్సహించాలని సూచించారు. అలాగే ఏపీలోని చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ వెంట జపనీస్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ అభివృద్ధి చేసే ప్రతిపాదనను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
జేబీఐసీ ఎగ్జిక్యూటివ్ ఎండీ హషియామా షిగెటో మాట్లాడుతూ, జాతీయ పెట్టుబడి మరియు మౌలిక సదుపాయాల నిధుల ద్వారా భారత్‌లో ప్రభుత్వ ప్రాజెక్టులకు పెట్టుబడులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఎన్‌టీపీసీకి విద్యుత్ సరఫరా చేసే ఎస్‌బీజీ క్లీన్‌టెక్ ప్రాజెక్టు, 350 మెగావాట్ల కర్నూలు అల్ట్రా మెగా సోలార్ పార్కు (2017లో ఏర్పాటు చేసింది)కు జేబీఐసీ రుణం అందించిందని గుర్తుచేశారు. విశాఖపట్నంలోని అచ్యుతాపురం పారిశ్రామిక ప్రాంతంలో టైర్ల తయారీ కర్మాగారం విస్తరణకు పర్యావరణ పరిశీలన పూర్తయిందని వివరించారు. భారత్‌లో వాహనాలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ సేవలు, తయారీ, మౌలిక సదుపాయాల రంగాల్లో జపాన్ పెట్టుబడులు ఉన్నాయని చెప్పారు. పునరుత్పాదక ఇంధన సామర్థ్య ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందించేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌తో రూ.6,500 కోట్ల గ్రీన్ క్రెడిట్ లైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.