YS Jagan : మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ ని కలసిన కరేడు గ్రామస్తులు
ప్రభుత్వం తమ భూములు లాక్కోకుండా చూడాలని వినతి;
పచ్చటి పంటపొలాలు ఉండే తమ భూములు ప్రభుత్వం లాక్కోకుండా చూడాలని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామస్తులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డిని మంగళవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో కలిసారు. కూటమి ప్రభుత్వం తమ భూములను బలవంతంగా లాక్కోవాలని చూస్తోందంటూ కరేడు గ్రామస్తులు వైఎస్.జగన్ కి ఫిర్యాదు చేశారు. ఇండోసోల్ కంపెనీకి ఎప్పుడో భూములు తీసుకుని కూడా ఇప్పుడు కరేడు గ్రామంలో భూములు సేకరించాలనుకోవడం వెనుక ఎదో కుట్ర ఉందని గ్రామస్తులు జగన్ దృష్టికి తీసుకు వచ్చారు. కరేడు గ్రామంలో దాదాపు రెండున్నర వేల మత్స్యకార కుటుంబాలు నివాసం ఉంటాయని, మొత్తం 18 వేల మంది జనాభా ఉంటుందని మాజీ శాసనసభ్యులు బుర్రా మధుసూధన్ యాదవ్ జగన్ కు వివరించారు. ఈ సందర్భంగా తనను కలసిన కరేడు గ్రామస్తులకు వైఎస్.జగన్ ధైర్యం చెప్పారు. మీరు చేస్తున్న పోరాటానికి అండగా ఉంటానని వైసీపీ అధినేత హామీ ఇచ్చారు. అవసరమైతే కరేడు గ్రామానికి వస్తానని గ్రామస్తులకు మాట ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మధుసూధన్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ పచ్చని పంట పొలాలు లాగేసుకుంటే ఎట్టి పరిస్ధితుల్లో ఒప్పకునేది లేదని స్పష్టం చేశారు. ఇండోసోల్ కి ఎప్పుడో భూములు సేకరించి ఇప్పుడు కరేడు గ్రామంలో మళ్ళీ భూసేకరణకు కూటమి సర్కార్ సిద్దపడటం సరికాదన్నారు. ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మాట్లాడుతూ మా హయాంలో రామాయపట్నం పోర్టు కోసం చేసిన భూ సేకరణ చేసినప్పుడు నిర్వాసితులకు సర్ధిచెప్పి వారందరికీ పునరావాసం కల్పించామని, అలాగే ఇండో సోల్ పరిశ్రమ ఏర్పాటు కూడా అవసరమైన భూమిని సేకరించి ఇచ్చామని, ఇప్పుడు కూటమి సర్కార్ ఇండోసోల్ ను బలవంతంగా వేరే చోటుకు తరలించాలని చూస్తోందని మాధవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.