Venkaiah Naidu: పరిజ్ఞానమే ప్రధానం.. డిగ్రీలు మాత్రమే కాదు: వెంకయ్యనాయుడు
డిగ్రీలు మాత్రమే కాదు: వెంకయ్యనాయుడు
Venkaiah Naidu: దేశాన్ని, మాతృభాషను, చదివిన విద్యాసంస్థను, గురువులను ఎప్పటికీ మరచిపోకూడదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సంఘం స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
యువత పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాలని, సామాజిక సమస్యలపై అవగాహన పెంచుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. మన పూర్వీకులు అందించిన సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలని పిలుపునిచ్చారు. మన సాంప్రదాయ కట్టుబాట్లు, బొట్టు వంటివాటికి మరింత ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించారు. తెలుగు భాష గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేయాలని కోరారు. భారతదేశం విశ్వగురువుగా విరాజిల్లినప్పటికీ, ఇతర దేశాలపై ఎప్పుడూ దండయాత్రలు చేయలేదని గుర్తుచేశారు. కులం కంటే గుణం ముఖ్యమని, భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచ వేదికలపై చాటిచెప్పుతున్నామని అన్నారు. డిగ్రీలు సంపాదించడం కంటే పరిజ్ఞానం సముపార్జన చేయడం ముఖ్యమని ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రశంసించారు.
కృత్రిమ మేధ (ఏఐ)ను అదుపులో ఉంచి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఏఐ వ్యాప్తి చెందితే మానవ సంబంధాలు కరిగిపోతాయేమో అనే ఆందోళన తనకు ఉందని చెప్పారు. ద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఏఐను ఉపయోగించకుండా కట్టడి చేయాలని సూచించారు. సోషల్ మీడియా తప్పుడు సమాచారానికి వేదికగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలను సరైన మార్గంలో నడిపించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్‌లో అనేక రంగాల్లో ఉద్యోగాలు కనుమరుగవుతాయని, దీనిపై చర్చలు జరపాలని సూచించారు.
రాజకీయ నాయకులు అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో అలాంటి బూతులు మాట్లాడినవారు ఓటమి చవిచూశారని గుర్తుచేశారు. వ్యవస్థలో అలాంటి వ్యక్తులను ప్రోత్సహించకూడదని, సమాజం వారిని బహిష్కరించాలని సూచించారు. రామాయణాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కోరారు. తల్లిదండ్రులు, పెద్దలు పిల్లలకు మరింత సమయం కేటాయించాలని సలహా ఇచ్చారు. గూగుల్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా, మెదడుకు పని చెప్పాలని అన్నారు. మంచి సమాజ నిర్మాణానికి అందరూ కలిసి కృషి చేయాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.