Kurnool Bus Fire Accident: కర్నూలు బస్సు అగ్నిప్రమాదం: వందల మొబైల్ ఫోన్లు పేలి.. ప్రమాద తీవ్రతకు ప్రధాన కారణం!
వందల మొబైల్ ఫోన్లు పేలి.. ప్రమాద తీవ్రతకు ప్రధాన కారణం!
బస్సు లగేజీ కంపార్ట్‌మెంట్‌లో కొత్త మొబైల్ ఫోన్ల పార్సెల్
ఫోరెన్సిక్ టీమ్‌ల ప్రాథమిక పరిశీలన
మంటల్లో దగ్ధమైన కొత్త సెల్‌ఫోన్లు
Kurnool Bus Fire Accident: కర్నూలు జిల్లా శివార్లలో చిన్నటేకూరు సమీపంలో అగ్నిప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు లగేజీ కంపార్ట్‌మెంట్‌లో రవాణా చేస్తున్న వందలాది మొబైల్ ఫోన్లు పేలడం వల్ల ప్రమాదం తీవ్రత పెరిగి, భారీ ప్రాణనష్టం జరిగిందని ఫోరెన్సిక్ టీమ్‌లు ప్రాథమికంగా నిర్ధారించాయి. ‘ముందుగా బస్సు ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న వెంటనే ఆ వాహనం ఆయిల్ ట్యాంక్ మూత తెరుచుకుని పెట్రోల్ కారడం ప్రారంభమైంది. అదే సమయంలో బస్సు కింది భాగంలో ద్విచక్ర వాహనం ఇరుక్కుపోయి, బస్సు కొంత దూరం దాన్ని ఈడ్చుకుపోయింది. ఈ ప్రక్రియలో నిప్పురవ్వలు చెలరేగి, పెట్రోల్ తోడవడంతో మంటలు మొదలయ్యాయి. ఈ మంటలు ముందుగా లగేజీ కంపార్ట్‌మెంట్‌కు అంటుకున్నాయి. అందులో 400కు మించిన మొబైల్ ఫోన్లతో కూడిన పార్సెల్ ఉండటంతో, అధిక ఉష్ణోగ్రతకు ఆ ఫోన్ల బ్యాటరీలు ఒకేసారి పేలిపోయాయి. ఆ మంటలు లగేజీ కంపార్ట్‌మెంట్ పైనున్న ప్రయాణికుల సీటింగ్ ఏరియాకు వ్యాపించాయి. దీంతో లగేజీకి సరిగ్గా పైనున్న సీట్లు, బెర్తుల్లో ఉన్న ప్రయాణికులకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. అందుకే బస్సు ముందు భాగంలోని సీట్లు, బెర్తుల్లో ఉన్నవారు ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు’ అని ఘటనా స్థలాన్ని, దగ్ధమైన బస్సును పరిశీలించిన ఫోరెన్సిక్ టీమ్‌లు తెలిపాయి.
బ్యాటరీల పేలుడు కారణంగా భారీ ధ్వని
లగేజీ కంపార్ట్‌మెంట్‌లోని బ్యాటరీలు ఒకేసారి పేలడంతో భారీ ధ్వని వచ్చింది. దీంతో డ్రైవర్ బస్సును ఆపి, తన సీటు పక్కనున్న కిటికీ ద్వారం నుంచి దిగి వెనక్కి వెళ్లి పరిస్థితి చూసి అక్కడి నుంచి పారిపోయాడు. అప్పటికే బస్సు దట్టమైన పొగ, మంటల్లో చిక్కుకుంది. లోపల ఉన్న ప్రయాణికులు తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, కుడి వైపునున్న ఎమర్జెన్సీ డోర్ తెరుచుకోకపోవడంతో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి.
నియమాలకు వ్యతిరేకంగా సరకు రవాణా
ప్రయాణికుల బస్సుల్లో వారి వ్యక్తిగత సామాను తప్ప మరే ఇతర సరకులను రవాణా చేయకూడదు. అయితే, ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు ప్రయాణికుల వాహనాలను సరకు రవాణాకు ఉపయోగిస్తున్నారు. వాటిని లగేజీ కంపార్ట్‌మెంట్‌లలో ఉంచుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఆ సరకులకు మంటలు అంటుకుని ప్రమాద తీవ్రత పెరుగుతోంది. కర్నూలు ఘటనలో కూడా మొబైల్ ఫోన్ల పేలుడు ప్రమాద తీవ్రతకు ముఖ్య కారణంగా ప్రాథమికంగా తేలింది. సాధారణంగా మొబైల్ ఫోన్ల బాడీని ప్లాస్టిక్‌తో, బ్యాటరీలను లిథియంతో తయారు చేస్తారు. ప్లాస్టిక్ త్వరగా అంటుకుంటుంది, లిథియం మంటల్లో పడితే పేలుతుంది. ఇది తెలిసినా ప్రయాణికుల వాహనాల్లో ఇలాంటి సరకులను రవాణా చేయడం ఈ భారీ ప్రాణనష్టానికి కారణమైంది.