Home Minister Anita on Kurnool Tragedy: కర్నూలు దుర్గటన.. 16 బృందాలతో దర్యాప్తు: హోం మంత్రి అనిత
16 బృందాలతో దర్యాప్తు: హోం మంత్రి అనిత
Home Minister Anita on Kurnool Tragedy: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వి. మగంటి అనిత వెల్లడించారు. ఈ మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఆరుగురు చొప్పున, ఒడిశా, బిహార్‌ల నుంచి ఒక్కొక్కరు, తమిళనాడు, కర్ణాటకల నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు. మరో మృతదేహం గుర్తించడానికి ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. కర్నూలు వ్యాస్ ఆడిటోరియంలో హోం మంత్రి అనిత, రవాణా మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ బస్సులో మొత్తం 39 మంది పెద్దలు, నలుగురు చిన్నారులు ప్రయాణిస్తున్నారని వివరించారు. ప్రస్తుతానికి తీవ్ర గాయాలతో 9 మంది చికిత్స పొందుతున్నట్లు మంత్రి అనిత పేర్కొన్నారు.
ఈ ఘోర ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారని హోం మంత్రి తెలిపారు. డ్రైవర్‌ను అరెస్టు చేసి, తీవ్రంగా విచారిస్తున్నామని చెప్పారు. అతను ఇచ్చిన ప్రాథమిక సమాచారం ఆధారంగా ప్రమాదానికి గల నిజమైన కారణాలపై ఆరా తీస్తున్నామని వివరించారు. ప్రమాదంలో మృతదేహాలు పూర్తిగా కాలిపోయి, గుర్తించలేని విధంగా ఉన్నాయని, డీఎన్‌ఏ టెస్టుల ద్వారా వాటిని గుర్తించి, సంబంధిత కుటుంబాలకు అందజేస్తామని మంత్రి అనిత హామీ ఇచ్చారు. ఈ దుర్ఘటనపై అన్ని కోణాల్లో పరిశీలించేందుకు 16 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుందని తెలిపారు.
రవాణా మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుందని ప్రకటించారు. అలాగే, గాయపడిన ప్రయాణికులకు రూ.2 లక్షల చొప్పున సహాయం అందించనున్నామని చెప్పారు. ఈ ప్రమాదం రహదారి భద్రత, వాహన నియంత్రణలపై మరోసారి ఆలోచింపజేస్తోందని మంత్రులు అభిప్రాయపడ్డారు. ప్రమాద స్థలంలో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.