రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల కొరత...

నిధుల లేమితో కొన్ని పనులకు పరిపాలనా అనుమతుల ఇవ్వని ప్రభుత్వం;

Update: 2025-07-12 04:21 GMT

రాజధాని అమరావతిలో కొన్ని కీలక అభివృద్ధి పనులకు నిధుల కొరతతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సతమతమవుతోంది. ఈ పనులను పూర్తి చెయ్యడానికి ఎక్కడ నుంచి నిధులు సమకూర్చుకోవాలో అర్ధంకాని సందిగ్ధతలో ఏపీ ప్రభుత్వం సతమతమవుతోంది. నిధుల సమీకరణలో అడుగు ముందుకు పడకపోవడంతో దాదాపు 20 అతి ముఖ్యమైన పనులకు ఏపీ ప్రభుత్వం ఇంకా పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేయకుండా జాప్యం చేస్తోంది. అమరావతి ఐకానిక్‌ వారధి పేరుతో తలపెట్టిన ప్రాజెక్టు వ్యయం రూ. 2062.46 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం అచనా వేసింది. అలాగే రాజధాని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అంచనా వ్యయం రూ.8800 కోట్లు లెజిస్లేచర్‌ భవనం మధ్యలో పొడవాటి స్పైక్‌ నిర్మాణానికి రూ.600 కోట్లు, నీరుకొండలో తెలుగుదేశం పార్టీ వ్యవస్ధపకు నందమూరి తారక రామారావు విగ్రహం ఏర్పాటుకు రూ.500 కోట్లు ఇలా వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు నిధుల లేమితో ప్రతిపాదనల దశలోనే ఆగిపోయి ఉన్నాయి. రాజధాని అమరావతి రూపు రేఖలు మార్చి నగరాన్ని అత్యంత ఆధునికంగా తీర్చిదిద్దగలవని భావిస్తున్న ఈ అభివృద్ధి పనులను ప్రారంభించడానికి అవసరమైన నిధుల కోసం ఏపీ ప్రభుత్వం వేట ప్రారంభించింది. ఈనెల 14వ తేదీన చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అమరావతి పేరు మీద అదనంగా వేల కోట్ల రూపాయల నిధుల మంజూరు చేయించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ లోని కూటమి సర్కార్‌ భావిస్తోంది. అలాగే ప్రపంచ బ్యాంక్‌ ఏడీబీ రుణం పొందడాకి అనుమతులు కోరుతూ కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదనలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

ఎట్టిపరిస్ధితుల్లో 2028వ సంవత్సరం మార్చి 31వ తేదీ నాటికి అమరావతిలో ప్రభుత్వం తరపున చేయాల్సిన అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టార్గెట్‌ పెట్టుకుంది. అనుకున్న గడువులోపు అమరావతి అభివృద్ధిని రాష్ట్ర ప్రజలకు చూపించలేకపోతే 2029లో జరిగే ఎన్నికల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుందనే ఆందోళన కూటమి సర్కార్‌ లో కనిపిస్తోంది. అమరావతిలో ప్రభుత్వం తలపెట్టిన తొలి రియల్ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌ హ్యాపీ నెస్ట్‌ బహుళ అంతస్తుల భవనాలను 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని చంద్రబాబు సర్కార్‌ ప్రణాళిక చేసుకుంటోంది. 2028 మార్చి కల్లా కనీసం లెజిస్లేచర్‌ భవనం, ప్రభుత్వ కార్యాలయాల టవర్లు పూర్తి చేయాలనే సంకల్పంలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇవి కనీసం స్ట్రక్చర్లు అయినా పూర్తి చేసి ప్రజల్లో నమ్మకం కలిగించగలిగితే తరువాత నెమ్మదిగా ఇంటీరియర్‌ పనులు చేసుకోవచ్చనే ఆలోచనలో ఏపీ సర్కార్‌ ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు. హైకోర్టు భవన నిర్మాణం కూడా 2028 మార్చి నాటికి పూర్తి చేయాలనుకున్నప్పటికీ భవనం ఆకృతి మార్చాలనే డిమాండ్‌ వస్తున్న నేపథ్యంలో హైకోర్టు నిర్మాణం ఆలశ్యం అయ్యే అవకాశం ఉన్నట్లు చెపుతున్నారు. ప్రధానంగా ఐకానిక్‌ భవనాల నిర్మాణానికి అవసరమయ్యే నిధులు ఎలా సమాకూర్చాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది.

ఇక ఎలాగైనా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రాష్ట్ర మంత్రులు, హైకోర్ట్‌ జడ్జిల నివాస సముదాయాలు, శాసన మండలి, శాసనసభ సభ్యుల రెసిడెన్షియల్‌ భవనాలు, ముఖ్య కార్యదర్శలు, కార్యదర్శలు బంగళాలు, అఖిల భారత సర్వీసు అధికారుల నివాసాలు శరవేగంతో పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి రాజధాని అమరావతిలో తొలి గృహ ప్రవేశ వేడుకలు నిర్వహించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఆమేరు ఈ భవనాలన్నింటినీ పూర్తి చేసి 2026 జనవరి 15 నాటికి గృహప్రవేశానికి సిద్దం చేయాలని కాంట్రాక్టర్లను ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News