Nara Lokesh: పక్క రాష్ట్రాలు మన వైపే చూసేలా అభివృద్ధి సాధిద్దాం.. కసితో పనిచేద్దాం: నారా లోకేశ్
నారా లోకేశ్
Nara Lokesh: ఆగస్టు 15 కేవలం ఒక తేదీ మాత్రమే కాదు. చరిత్రను గుర్తుచేసుకొని భవిష్యత్తును నిర్మించుకునే రోజు అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య మైదానంలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత ప్రసంగిస్తూ ఆయన ఈ విషయాలు పేర్కొన్నారు.
విద్యా రంగంలో ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొస్తోందని లోకేశ్ చెప్పారు. పాఠ్యపుస్తకాలపై సీఎం ఫోటో లేదా తన ఫోటోలు ఉంచకుండా, ర్యాంకులు సాధించిన విద్యార్థుల ఫోటోలను ముద్రించామని ఆయన వెల్లడించారు. విద్యను ఉపాధి రంగానికి అనుసంధానం చేస్తున్నామని కూడా అన్నారు.
రాజధాని అమరావతికి కేంద్రం చట్టబద్ధత కల్పించిందని, పోలవరం నిర్మాణం, విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ, రైల్వే జోన్ వంటి అంశాలను సాధించామని లోకేశ్ గుర్తు చేశారు. అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్లు అని చెప్పారు. పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చి రాష్ట్రానికి గుర్తింపు తెచ్చాయని, ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
“ఇంకా ఎన్నేళ్లు ఉద్యోగాలు, ఉపాధి కోసం పక్క రాష్ట్రాల వైపు చూస్తాం? అన్ని రంగాల్లో ఏపీని ముందు వరుసలో ఉంచేందుకు కృషి చేస్తున్నాం. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని ప్రమాణం చేద్దాం. కసితో, పట్టుదలతో పనిచేద్దాం. పక్క రాష్ట్రాలు మన వైపు చూసేలా అభివృద్ధి సాధిద్దాం” అని మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు.