CM Chandrababu: తెలుగుదేశం పార్టీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఓటు బ్యాంకును పెంచుకోవాలని, అదే సమయంలో వైసీపీ (గొడ్డలి పార్టీ) చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించకుండా తిప్పికొట్టాలని స్పష్టం చేశారు.

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న కాంక్లేవ్‌లో రెండో రోజు సుస్థిర అభివృద్ధి, ప్రజా సేవలు, సానుకూల ప్రచారం అంశాలపై చర్చలో పాల్గొన్న చంద్రబాబు.. రాష్ట్ర స్థూల అభివృద్ధిని నియోజకవర్గాల అభివృద్ధితో అనుసంధానం చేసి ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెంచాలని సూచించారు. 2026-27లో రాష్ట్ర జీఎస్డీపీ రూ.20.35 లక్షల కోట్లుగా ఉందని, 15-20 రంగాల్లో అభివృద్ధి ద్వారా దీన్ని మరింత పెంచాలన్నారు. మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, అన్ని ప్రాజెక్టులు పూర్తయితే 1,250 నుంచి 1,400 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. గూగుల్ వంటి డేటా సెంటర్లతో భారీగా ఉద్యోగాలు, లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని, నీటి లభ్యత సమస్య కాదని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సక్సెస్ స్టోరీలు సృష్టించి ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు.

అదే సమయంలో వైసీపీ చేస్తున్న ఫేక్, దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించవద్దని ఆదేశించారు. ఏపీలో చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు చెప్పుకోవాలని, సోషల్ మీడియా సహా వివిధ మార్గాల్లో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రమోట్ చేయాలని సూచించారు. ప్రత్యర్థులు టీడీపీ, కూటమి నేతలపై విమర్శలు చేస్తే టీమ్ స్పిరిట్‌తో కౌంటర్లు ఇవ్వాలని, నియోజకవర్గ స్థాయిలోనూ వెంటనే తిప్పికొట్టాలని ఆదేశించారు. లిక్కర్ స్కాం, వివేకా హత్య, ఏపీపీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఎందుకు మాట్లాడదని ప్రశ్నించారు. డీఎస్సీపై కుట్రపూరిత ప్రచారం, కుప్పంలో టీచర్లను బెదిరించే స్థాయికి వారి మీడియా దిగజారిందని విమర్శించారు. మై టీడీపీ యాప్‌ను పూర్తి స్థాయిలో వినియోగించాలని, రాబోయే కాలంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

పౌర సేవలు అందించడంలో కొన్ని నియోజకవర్గాలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయని, అన్ని నియోజకవర్గాలూ బెస్ట్ ప్రాక్టీసెస్‌ను అమలు చేయాలని మార్గనిర్దేశం చేశారు. వాట్సాప్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్ ద్వారా పబ్లిక్ గ్రీవెన్స్‌లను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని, దీర్ఘకాలిక సమస్యలను స్వయంగా తీసుకుని పరిష్కరించాలని సూచించారు. ఉచిత ఇసుక విధానం, మద్యం విక్రయాల పారదర్శకత వంటి అంశాలపైనా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడైనా అవకతవకలు జరిగితే కఠినంగా ఉంటామని, నియోజకవర్గాల్లో సెట్ రైట్ చేసుకునే బాధ్యత ఎమ్మెల్యేలదేనని హెచ్చరించారు.

అభివృద్ధితో ఓటు వేయని వారినీ మార్చుకుందాం అని పిలుపునిచ్చిన చంద్రబాబు.. ప్రజలకు దగ్గరవ్వాలని, మానవత్వంతో స్పందించాలని టీడీపీ నేతలకు సూచించారు.

Tags: