Deputy Chief Minister Pawan Kalyan: పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర కోత నుంచి రక్షణ కల్పించేందుకు రక్షణ గోడ నిర్మాణానికి డీపీఆర్, డిజైన్ పనులు ప్రారంభమయ్యాయని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తెలిపారు. ఆదివారం ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఈ వివరాలు పేర్కొన్నారు.

జాతీయ విపత్తు నిర్వహణ నిధి నుంచి కేటాయించిన రూ.323 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. తీరప్రాంత ఇంజినీరింగ్, సముద్ర పరిశోధనల్లో అనుభవం ఉన్న ఐఐటీ-మద్రాస్ నుంచి వచ్చిన ఐదుగురు నిపుణుల బృందం గత వారం రోజులుగా సముద్ర గర్భం, తీర ప్రాంతం వెంబడి సర్వే నిర్వహిస్తోంది. రక్షణ గోడ నిర్మాణానికి అనువైన ఎలైన్‌మెంట్ గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.

నిపుణుల బృందం అధునాతన డ్రోన్లు, బీచ్ ప్రొఫైలింగ్, తీర ప్రాంతాల మ్యాపింగ్ కోసం ట్రింబుల్ ఆర్ 980 జీఎన్‌ఎస్‌ఎస్ ఆర్‌టీకే సాంకేతికతను ఉపయోగిస్తోంది. తీరప్రాంత భౌగోళిక పరిస్థితులు, సముద్ర అలల ప్రభావం, తీరం కోత తీవ్రత, భూభాగ మార్పులపై సమగ్ర అధ్యయనం చేస్తోంది. బాతిమెట్రిక్ సర్వే ద్వారా సముద్రపు లోతు, సీ బెడ్ స్థాయిలు, వాటి మార్పులను గుర్తిస్తోంది. బీచ్ ఆకృతి, వాలు ఎత్తుపై అధ్యయనం కూడా కొనసాగుతోంది. షోర్‌లైన్ మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది.

నాలుగు దశాబ్దాలుగా ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు సముద్ర కోత సమస్యను ఎదుర్కొంటున్నారు. వందల ఎకరాల భూమి, పలు గ్రామాలు సముద్రంలో కలిసిపోయాయి. అనేక మంది నిర్వాసితులయ్యారు. ఈ సమస్య పరిష్కారానికి ఎన్‌డీఎంఏ ప్రతిపాదన మేరకు సీ ప్రొటెక్షన్ వాల్, గ్రోయిన్ ఫీల్డ్, హోప్ ఐలాండ్ పరిసరాల్లో ప్రకృతి ఆధారిత తీర రక్షణ చర్యలకు ఆమోదం లభించింది. అందులో భాగంగానే డీపీఆర్ రూపకల్పన పనులు మొదలయ్యాయి.

నిర్ణీత గడువులోగా నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా డిజైన్, డీపీఆర్ రూపకల్పన, పర్యావరణ, ఇతర అనుమతుల ప్రక్రియ పూర్తి చేసి ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని పవన్‌కల్యాణ్ సూచించారు. పిఠాపురంలో పర్యటించినప్పుడు నిపుణులతో ఈ అంశాలపై చర్చిస్తానని కూడా తెలిపారు.

Tags: