Pawan Kalyan: స్థానిక ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేద్దాం.. పొత్తు ధర్మంతోనే పోటీ: పవన్‌కల్యాణ్
పవన్‌కల్యాణ్
Pawan Kalyan: సాధారణ ఎన్నికల్లో రాష్ట్రం, ప్రజల బాగు కోసం జనసేన త్యాగాలు చేసింది. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. మంగళవారం కాకినాడలో జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశం అంతర్గతంగా నిర్వహించారు.
‘సాధారణ ఎన్నికలు ప్రజల కోసం.. స్థానిక ఎన్నికలు పార్టీ బలోపేతం కోసం. ఆత్మాభిమానం తగ్గని రీతిలోనే జనసేన పోటీ చేస్తుంది. కూటమి ధర్మాన్ని పాటిస్తాం. అన్ని చోట్లా పొత్తులతోనే పోటీ చేస్తాం. అవసరమైతే మిత్రధర్మం పాటిస్తూనే పార్టీ బలంగా ఉందని కార్యకర్తలు నమ్మిన చోట్ల పోటీకి దిగుతాం’ అని పవన్‌కల్యాణ్ అన్నారు.
స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని ఆయన సూచించారు. లోక్‌సభ స్థానాల వారీగా నియమించిన పార్టీ కమిటీలు ఎక్కడ బలంగా ఉన్నామో గుర్తించి సరైన నివేదికలు ఇవ్వాలన్నారు. పొత్తు ధర్మం పాటిస్తూనే గెలిచే అన్ని స్థానాల్లోనూ పోటీ చేద్దామని చెప్పారు. 2024 సాధారణ ఎన్నికల్లో రాష్ట్రం, ప్రజల బాగు కోసం జనసేన కొన్ని త్యాగాలు చేసిందని, ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసుకుందామని అన్నారు. కార్యకర్తలు, నాయకులు చెప్పిన ప్రకారమే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.
పార్లమెంటరీ కమిటీలు వాస్తవిక అంచనాలతో కచ్చితమైన అభ్యర్థుల జాబితాలు సిద్ధం చేస్తే స్థానిక ఎన్నికల్లో వందశాతం విజయం సాధించడం కష్టం కాదని పవన్‌కల్యాణ్ అన్నారు. స్థానిక ఎన్నికల పొత్తులో 15 శాతం అని ప్రచారాలు జరుగుతున్నాయని, అవి నిజమో కాదో తనకు తెలియదని చెప్పారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల స్థాయిలోనే స్థానిక ఎన్నికల సర్దుబాట్లు జరగాలని, తప్పనిసరి పరిస్థితుల్లో తానే ముఖ్యమంత్రితో మాట్లాడతానని అన్నారు.
సాధారణ ఎన్నికల్లో నాయకుల గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తల ఎదుగుదలకు అందరూ పని చేయాలని, ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. పురపాలక, నగరపాలక సంస్థలు, పరిషత్తు ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తీసుకోవాలని, ఫలితాలు జనసేన గౌరవం పెంచేలా ఉండాలని అన్నారు. పార్టీలోకి రావాలని అనేక చోట్ల ఆసక్తి చూపుతున్నారని, సరైన వారిని ఆహ్వానించాలని సూచించారు.
సమావేశంలో ముందుగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ఇటీవల విశాఖలో తాను చెప్పిన కొన్ని అంశాలను కార్యకర్తలు అపార్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. పార్టీ విజయానికి నిబద్ధతతో పని చేద్దామన్నారు. మంత్రి కందుల దుర్గేష్, ఎంపీలు ఉదయ్ శ్రీనివాస్, బాలశౌరి, లింగమనేని రమేశ్ తదితరులు పాల్గొన్నారు.