Pawan Kalyan: కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ రెండో రోజు పర్యటన వైభవంగా కొనసాగింది. ‘పిఠాపురం నిండుగా అభివృద్ధి పండుగ’ కార్యక్రమంలో భాగంగా రూ.1,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.

మంగళవారం ఉదయం నుంచే పవన్‌ పర్యటన ప్రారంభమైంది. తొలుత గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని శ్రీసీతారామస్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పలు పథకాల లబ్ధిదారులకు సంబంధిత పత్రాలు అందజేశారు. 30 మంది మత్స్యకారులకు రక్షణ పరికరాలు అందించారు. ఆ తర్వాత ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్‌ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

పవన్‌ మాట్లాడుతూ ‘‘పిఠాపురంలో శాశ్వత డంపింగ్‌ యార్డుకు పరిష్కారం చూపాం. రోజుకు 72 లక్షల లీటర్ల సామర్థ్యంతో రెండు ఎస్‌పీటీల నిర్మాణం చేపట్టాం. రూ.225 కోట్లతో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మిస్తున్నాం. రూ.34 కోట్లతో ఆలయాల అభివృద్ధి, పునరుద్ధరణ పనులు ప్రారంభించాం. రూ.2 కోట్లతో కుంతీ మాధవస్వామి ఆలయ కోనేరును పునరుద్ధరించాం. మొబైల్‌ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ వాహనాలు ఏర్పాటు చేస్తున్నాం. 40 టన్నుల తడి చెత్తను శుభ్రం చేసే ప్లాంట్లు అందుబాటులోకి తీసుకొస్తున్నాం’’ అని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఆసక్తికరమైన ఘటన కూడా చోటుచేసుకుంది. ఓ అంధ బాలిక పవన్‌ను కలిసి ‘‘నాకు ఓ పద్యం వచ్చు. చెప్పనా’’ అని అడిగింది. పవన్‌ అంగీకరించగా ఆ చిన్నారి వేమన పద్యాన్ని వినిపించింది. పద్యంలోని భావాన్ని వివరిస్తూ ఆ లక్షణాలన్నీ పవన్‌లో ఉన్నాయని చెప్పింది. చిన్నారి మాటలకు ముగ్ధుడైన పవన్‌ ఆమెను అభినందించారు.

Tags: