Liquor Transport Scam: ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణం కేసులో మరో ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. గత ఎన్నికల్లో చిత్తూరు శాసనసభ నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన ఎర్రచందనం స్మగ్లర్‌గా పేరుగాంచిన మెట్టపల్లి చిన్నపరెడ్డి విజయానందరెడ్డి (ఎంసీ విజయానందరెడ్డి)కి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. గురువారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

చిత్తూరు నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన విజయానందరెడ్డి, నిఖిలానంద లాజిస్టిక్స్ పేరిట మద్యం రవాణా సబ్‌కాంట్రాక్టు నిర్వహించాడని ఈడీ గుర్తించింది. సిగ్మా, ప్రసాద్ ట్రాన్స్‌పోర్ట్స్ వంటి ముసుగు సంస్థల ద్వారా రాష్ట్రస్థాయిలో మద్యం రవాణా కాంట్రాక్టు సాధించిన వైకాపా ముఠా, ప్రాంతీయ స్థాయిలో తమ పార్టీ నాయకులు, బినామీలు, అనుచరుల పేరిట సబ్‌కాంట్రాక్టులు ఇచ్చింది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో నిఖిలానంద లాజిస్టిక్స్‌కు సబ్‌కాంట్రాక్టు అప్పగించి భారీ మొత్తంలో అనుచిత లబ్ధి కల్పించినట్లు దర్యాప్తులో తేలింది.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) నుంచి సిగ్మా, ప్రసాద్ ట్రాన్స్‌పోర్ట్స్ ఖాతాలకు, అక్కడి నుంచి నిఖిలానంద లాజిస్టిక్స్ ఖాతాలకు డబ్బులు జమైన తర్వాత అవి వివిధ మార్గాల్లో దారి మళ్లినట్లు ఈడీ కనుగొంది. ఇందులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందని గుర్తించిన ఈడీ, మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద విజయానందరెడ్డి వాంగ్మూలం నమోదు చేయనుంది. నిఖిలానంద లాజిస్టిక్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో హాజరు కావాలని కూడా ఆదేశించింది.

ఇంతకుముందు ఏపీ సిట్ బృందాలు విజయానందరెడ్డికి చెందిన నిఖిలానంద అపార్ట్‌మెంట్‌లో తనిఖీలు చేశాయి. వైకాపా నేత, మద్యం కుంభకోణం కేసు నిందితుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డికి చెందిన సీఎంఆర్ ప్రాజెక్ట్స్ సంస్థ కూడా అదే చిరునామాతో రిజిస్టరై ఉండటం గమనార్హం. తనిఖీల్లో అక్కడ వెల్‌టాస్క్ ఫుడ్ అండ్ బెవరేజస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బోర్డు కనిపించింది. కానీ ఆర్‌వోసీ రికార్డుల్లో అలాంటి కంపెనీ లేదని, ఐడెంటిఫికేషన్ నంబర్ కూడా బోగస్ అని తేలింది. సీఎంఆర్ ప్రాజెక్ట్స్, ముక్కోటి ఫుడ్స్, నిఖిలానంద లాజిస్టిక్స్, ఎంఏసీ గ్రానైట్స్, సోను గ్రానైట్స్, రాజ్ గ్రానైట్స్, ఎంఎస్‌జే ఎక్స్‌పోర్ట్స్, నిఖిలానంద డెవలపర్స్, శ్రీసాయి కన్వెన్షన్ సెంటర్, గౌతమిసాయి ఫైనాన్స్ వంటి అనేక సంస్థలు అదే కార్యాలయం నుంచి నడుస్తున్నట్లు సిట్ కనుగొంది. ఇవన్నీ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డి, విజయానందరెడ్డికి సంబంధించినవేనని, వీటి ద్వారా మద్యం ముడుపుల సొమ్ము రూటింగ్ చేసినట్లు అప్పట్లోనే సిట్ గుర్తించింది. ఈడీ కూడా వీటికి సంబంధించిన కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం.

విజయానందరెడ్డి సాధారణ డ్రైవర్‌గా జీవితం ప్రారంభించి, ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా తక్కువ కాలంలోనే రూ.వందల కోట్ల ఆస్తులు సంపాదించారనే ఆరోపణలున్నాయి. 2014లో నాటి తెదేపా ప్రభుత్వం ఆయనపై పీడీ యాక్ట్ కూడా ప్రయోగించింది. ఆ అక్రమార్జనతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టి, 2019 ఎన్నికల్లో రాయలసీమలో పలు వైకాపా అభ్యర్థుల ఎన్నికల ఖర్చులు భరించారని చెబుతారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఏపీఎస్‌ఆర్టీసీ వైస్‌ఛైర్మన్ పదవి పొందారు. అనంతరం మద్యం రవాణా సబ్‌కాంట్రాక్టు సహా అనేక అంశాల్లో భారీ లబ్ధి పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసులో ఈడీ విచారణ మరిన్ని కొత్త విషయాలను వెలుగులోకి తీసుకురావచ్చని అంచనా.

Tags: