Lokesh: లోకేశ్‌: ఏపీకి ఎన్‌ఆర్‌ఐలే బ్రాండ్‌ అంబాసిడర్లు.. పెట్టుబడులు తీసుకురావాలి

పెట్టుబడులు తీసుకురావాలి

Update: 2025-10-20 06:07 GMT

Lokesh: ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఎన్‌ఆర్‌ఐలు బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారాలని మంత్రి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే ప్రక్రియలో భాగస్వాములవ్వాలని, పెట్టుబడులు పెట్టాలనుకునే కంపెనీలకు సమాచారం అందించాలని కోరారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీఎన్‌ఆర్‌టీ ఆధ్వర్యంలో సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లోని నోబెల్‌ డైనింగ్‌ రూంలో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది.


‘గత 16 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ విధానం. జోన్‌ల వారీగా ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే మా లక్ష్యం. ఉత్తరాంధ్రను మెడికల్‌ డివైజెస్‌, ఫార్మా హబ్‌, స్టీల్‌ సిటీ, డేటా సెంటర్‌గా తీర్చిదిద్దుతున్నాం. ఏపీలో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం ఉంది. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు’ అని లోకేశ్‌ వివరించారు.

రాష్ట్రానికి గూగుల్‌ రావడంలో కేంద్ర ప్రభుత్వ సహకారం ఉందన్నారు. ‘గూగుల్‌ పెట్టుబడుల కోసం కొన్ని చట్టాల సవరణలు కోరింది. ప్రధాని మోదీ అంగీకరించారు. ఆర్సెలార్‌ మిత్తల్‌ ప్రాజెక్టులోనూ కేంద్రం సహకరించింది. కొప్పర్తి, ఓర్వకల్‌ ఇండస్ట్రియల్‌ నోడ్‌లు, ఎన్టీపీసీ గ్రీన్‌ కారిడార్‌, నక్కపల్లి ఫార్మాసిటీలు మా అభివృద్ధి ప్రాజెక్టులు. రాబోయే 15 ఏళ్లు కూటమి ఏపీని ముందుకు తీసుకెళ్తుంది’ అని చెప్పారు.



ఎంఎస్‌ఎంఈలకు ప్రాధాన్యం

గూగుల్‌తో సమానంగా ఎంఎస్‌ఎంఈలకు ప్రాధాన్యం ఇస్తామని లోకేశ్‌ తెలిపారు. ‘ఎన్‌ఆర్‌టీలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తాం. దాన్ని ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డుకు లింక్‌ చేస్తాం. ఆస్ట్రేలియాలో 75 వేల మంది తెలుగువారు, 21 వేల మంది విద్యార్థులు ఉన్నారు. న్యూజిలాండ్‌లో 25 వేల మంది ఉన్నారు. ఏపీఎన్‌ఆర్‌టీ మీకు అండగా ఉంటుంది. ఓంక్యాప్‌ ద్వారా విదేశాల్లో లక్ష మందికి ఉపాధి కల్పిస్తాం. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రత్యేక సందర్శనకు ఆహ్వానించింది. ఈ పర్యటనలో విశ్వవిద్యాలయాల విద్యార్థులను కలుస్తాను’ అని వివరించారు.

చంద్రబాబు విజనరీ లీడర్‌

‘సీఎం చంద్రబాబు వేగాన్ని అందుకోవడం మాకే కష్టమవుతోంది. ఆయన క్వాంటమ్‌ కంప్యూటర్‌ గురించి మాట్లాడితే, నేను చాట్‌జీపీటీలో వెతికి తెలుసుకున్నాను. అందుకే ఆయన్ను విజనరీ అంటారు. మీరు ఎన్‌ఆర్‌ఐలు కాదు.. మోస్ట్‌ రిలయబుల్‌ ఇండియన్స్‌ (ఎంఆర్‌ఐ). చంద్రబాబు అరెస్టును మీరు నిరసనలతో వ్యతిరేకించారు. 2024 ఎన్నికల్లో కూటమి విజయానికి మీరు కష్టపడ్డారు. దాని ఫలితమే 94 శాతం సీట్లు గెలవడం’ అని లోకేశ్‌ అన్నారు.

సిడ్నీలో ఘనస్వాగతం

సిడ్నీలో మంత్రి లోకేశ్‌కు ఘనస్వాగతం లభించింది. విద్య, ఐటీ శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిగాయి.

Tags:    

Similar News