బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం

వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు;

Update: 2025-07-25 12:32 GMT

వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లోని వాయుగుండం గడిచిన 3 గంటల్లో గంటకు 18 కి.మీ వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుందని హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత వెల్లడించారు. ఇది ప్రస్తుతానికి ఖేపుపారా (బంగ్లాదేశ్) కు దాదాపు 190 కి.మీ., కానింగ్ (పశ్చిమ బెంగాల్) కు 40 కి.మీ., సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) 50 కి.మీ., కోల్‌కతా (పశ్చిమ బెంగాల్) కు 60 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైన ఉందన్నారు.ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ బెంగాల్,ఉత్తర ఒడిశా, జార్ఖండ్ వైపుగా కదులేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ మోడల్స్ తెలుపుతున్నాయని అన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలోని స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్(ఎస్ఈవోసి) నుంచి మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దీపక్, ప్రాజెక్టు మేనేజర్లు మరియు సిబ్బందితో హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. వాతావరణ పరిస్థితులను ఎస్ఈవోసి నుంచి స్వయం పరిశీలించి ఆరా తీశారు. చెదురుమదరుగా భారీ వర్షాలు, వర్షాకాలం సీజన్లో సంభవించే వాయుగుండాలు, తుపానులు, వరదలు వంటి వాటి పట్ల స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను రూపొందించి అమలు చేయాలని సూచించారు. ఆదివారం వరకు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాలు, మిగతాచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు హోర్డింగ్స్, శిధిలావస్థలో ఉన్న భవనాలు, గోడలు, వృక్షాలు వద్ద నిలబడరాదన్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తీరాల్లో 2.9 నుంచి 3.6 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. తీరప్రాంత కార్యకలాపాల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800 425 0101 ను సంప్రదించాలన్నారు.

వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రమాద హాట్ స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఇరిగేషన్, ఆర్ అండ్ బి, పంచాయితీరాజ్ శాఖలతో నమన్వయ పరుచుకుని గండ్లు గుర్తించి మరమ్మతులు వేగంగా పూర్తిచేయాలని మంత్రి అనిత ఆదేశించారు. విపత్తుల పట్ల సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మోద్దని, విపత్తుల నిర్వహణ సంస్థ అధికారిక హెచ్చరికలు గమనిస్తూ ఉండాలని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News