ఎపి బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మాధవ్
మా కుటుంబం… భారతీయ జనాతా పార్టీ వేరు వేరు కాదని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నూతన అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. మంగళవారం ఆయన ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. ఎంతో మంది బీజేపీ కోసం పనిచేస్తున్నా నా మీద నమ్మకం ఉంచినందుకు కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు కృషి చేస్తానని మాధవ్ చెప్పారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి వందేళ్ళు అయిన సందర్భంంలో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిని అవ్వడం ఆనందంగా ఉందన్నారు. ఎమర్జెన్సీ సమయంలో తాను పుట్టానని చంటిబిడ్డగా అమ్మతో పాటు పోలీస్ స్టేషన్లోనే ఉన్నానని తెలిపారు. పురంధేశ్వరి సారధ్యంలో ఎనిమిది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను సాధించామని ఈ సంఖ్యను రెట్టింపు చేసేలా ఏపీలో బీజేపీ క్రియాశీలకంగా పనిచేస్తుందన్నారు. అలాగే సోము వీర్రాజు బీజేపీ బలోపేతం కోసం ఇల్లు కూడా మరచిపోయి రాష్ట్రం అంతా తిరుగుతూ పనిచేశారన్నారు. ఎంతో మంది పెద్దలు బీజేపీలో ఉన్నారని వారి సహకారంతో పార్టీని మరింత ముందుకు తీసుకువెళతానని మాధవ్ బీజేపీ శ్రేణులకు హామీ ఇచ్చారు. పార్టీ కేంద్ర నాయకత్వం నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, బీజేపీని ఏపీలో అధికారంలోకి తెచ్చే దిశగా పని చేస్తానని పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు.