Kadapa District: కడప జిల్లాలో పరిషత్ పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత.. పెట్రోల్ బాంబులతో దాడులు
పెట్రోల్ బాంబులతో దాడులు
Kadapa District: పరిషత్ ఎన్నికలు కొన్ని జిల్లాల్లో రణరంగాన్ని తలపించాయి. పదవులతో ముడిపడిన పరువు, ప్రతిష్ఠ కోసం తలలు పగలగొట్టుకునే స్థాయికి వెళ్లారు. పెట్రోల్ బాంబులు విసురుకున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో రాజకీయ వేడి హింసాత్మక ఘటనలకు దారితీసింది.
పులివెందుల మండలం ఎర్రిపల్లె కేంద్రంలోనికి వెళ్లేందుకు వైకాపా కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైకాపా నేతలు పెట్రోల్ బాంబుల దాడికి దిగారు. లింగాల మండలంలోని పలు గ్రామాల్లోకి వెళ్లేందుకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రయత్నించగా స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్.తుమ్మలపల్లి వద్ద ఇరువర్గాల నాయకులు పెట్రోల్ బాంబులు విసురుకున్నారు. పులివెందుల మండలం నల్లపరెడ్డిపల్లెలో తెదేపా నాయకుల కార్లపై వైకాపా కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. నందలూరులోనూ ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
కలసపాడు, ఒంటిమిట్ట, సాలాబాదు పోలింగ్ కేంద్రాల వద్ద తెదేపా, వైకాపా వర్గాలు ఘర్షణపడ్డాయి. పెద్దముడియంలో వైకాపా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వర్గీయులు చెలరేగిపోయారు. గుండ్లకుంట, పెద్దపసుపుల, పెద్దముడియం పోలింగ్ కేంద్రాల వద్ద తెదేపా కార్యకర్తలపై దాడులకు దిగారు. రామసుబ్బారెడ్డి దంపతులు ఎన్నికల అధికారులు, పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. గోపవరం మండలం ఎస్.రామపురం పోలింగ్ కేంద్రంలోకి వైకాపా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి తనయుడు ఆదిత్యరెడ్డి, వైకాపా నేత నర్సారెడ్డి వెళ్లి బ్యాలట్ బాక్సులో ఇంకు పోశారు. గార మండలం శాలిహుండంలో వైకాపా, తెదేపా నేతలు కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. హిరమండలంలోని కొండరాగోలులో తెదేపా ఏజెంట్‌పై వైకాపా ఏజెంట్లు పిడిగుద్దులు కురిపించారు.
అనంతపురం జిల్లా కూడేరు మండలం మరుట్ల-2 గ్రామంలో తెదేపా మద్దతుదారులు దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తూ వైకాపా శ్రేణులు పోలింగ్ కేంద్రంలోకి చొరబడ్డాయి. ఏపీవో, ఓపీవోలపై దాడికి తెగబడ్డారు. బ్యాలట్ పెట్టెను బయటకు తీసుకెళ్లి రాళ్లతో ధ్వంసం చేసి, అందులోని బ్యాలట్ పత్రాలను చెల్లాచెదురుగా పడేశారు. ఈ వ్యవహారంలో 60 మందిపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కుందుర్పి మండలం బెస్తరపల్లిలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుపై స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలు దాడులు చేసేందుకు యత్నించారు. ఎమ్మెల్యే ప్రైవేటు అంగరక్షకుడిపై దాడి చేసి గాయపరిచారు.
కర్నూలు జిల్లా కోసిగి మండలం ఆర్లబండలోని పోలింగ్ కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి రిగ్గింగ్ చేశారు. చిప్పగిరి మండలం గుమ్మనూరులో తెదేపా, భాజపా వర్గీయుల మధ్య కొట్లాట జరిగింది. ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పు దిగవల్లిలో తెదేపా కార్యకర్తపై కత్తితో దాడి జరిగి తీవ్ర గాయాలయ్యాయి. పార్వతీపురం మన్యం, గుంటూరు జిల్లాల్లోనూ ఇలాంటి ఘర్షణలు నమోదయ్యాయి.
పోలీసులు అన్ని ప్రాంతాల్లో భారీ మోహరింపు చేసి పరిస్థితిని అదుపులో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు.