Deputy CM Pawan Kalyan: అటవీశాఖ చరిత్రలో మైలురాయి: ‘హనుమాన్’ ప్రాజెక్టును ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
‘హనుమాన్’ ప్రాజెక్టును ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Deputy CM Pawan Kalyan: రాష్ట్రంలో వన్యప్రాణులు-మానవుల మధ్య సంఘర్షణలను తగ్గించే దిశగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన ‘హనుమాన్’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, రాష్ట్ర అటవీశాఖ చరిత్రలో ఇది ఒక కీలక అడుగని విశేషంగా పేర్కొన్నారు.
ఏజెన్సీ ప్రాంతాలు, చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడుల సమస్యను సమర్థవంతంగా పరిష్కరించామని పవన్ కళ్యాణ్ తెలిపారు. అటవీ సరిహద్దు గ్రామాల్లో అలర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఇది ప్రజల భద్రతకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. వన్యప్రాణుల సంరక్షణతో పాటు మానవ జీవనాన్ని కాపాడే లక్ష్యంతోనే ఈ ప్రాజెక్టును రూపొందించామని వివరించారు.
కార్యక్రమం ముగిసిన వెంటనే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును కలిశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్, అటవీశాఖలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధికి నియోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులు వంటి విషయాలపై సమీక్ష జరిగింది. అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ‘హనుమాన్’ ప్రాజెక్టు వివరాలను సీఎంకు వివరంగా తెలియజేశారు పవన్.
ఈ ప్రాజెక్టు ద్వారా అటవీ ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలకు మెరుగైన భద్రత, వన్యప్రాణుల సంరక్షణలో సమతుల్యత సాధ్యమవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.