Minister Nara Lokesh: నారా లోకేశ్: కృత్రిమ మేధస్సు మానవాళికి ముప్పు కాదు.. మానవత్వాన్ని పరిపూర్ణం చేస్తుంది

మానవత్వాన్ని పరిపూర్ణం చేస్తుంది

Update: 2025-11-15 12:29 GMT

Minister Nara Lokesh: విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ సమ్మిట్ రెండో రోజు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ‘ఏఐ - భవిష్యత్ ఉద్యోగాలు’ అనే అంశంపై జరిగిన చర్చలో మంత్రి నారా లోకేశ్ ప్రసంగించారు. ప్రతి పారిశ్రామిక విప్లవం ఉద్యోగాలను మరింతగా పెంచుతుందని, కృత్రిమ మేధస్సు (ఏఐ) కూడా మానవాళికి ముప్పు కాదని ఆయన స్పష్టం చేశారు.

‘‘ఏఐని స్వీకరించడానికి ఏపీ మూడు మార్గాల్లో ముందుకు సాగుతోంది. పునర్నైపుణ్యం (రీస్కిల్లింగ్), పునర్వివరణ (రీడిఫైనింగ్), పునర్కల్పన (రీఇమాజినింగ్) ద్వారా మేము ప్రగతి సాధిస్తున్నాం. దీనికి ‘నైపుణ్య’ అనే ప్లాట్‌ఫాం అభివృద్ధి చేశాం. కృత్రిమ మేధస్సు మానవాళికి ముప్పు కాదు.. మానవత్వాన్ని పరిపూర్ణం చేస్తుంది’’ అని లోకేశ్ చెప్పారు.

ఐటీ రంగం వల్ల పారిశ్రామికులు అభివృద్ధి సాధిస్తున్నారని, ఫుడ్ ప్రాసెసింగ్‌లో వ్యాపారులు ముందుకు వెళ్తున్నారని ఆయన పేర్కొన్నారు. ‘‘రూ.50 వేలు నెలకు సంపాదించే వ్యాపారి రూ.1 లక్ష సంపాదించేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. రూ.5 లక్షలు సంపాదించేవారు రూ.25 లక్షలకు చేరేలా అభివృద్ధి చేయాలని పనిచేస్తున్నాం. అప్పుడే మనం 2.4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటాం. ఇక్కడి వ్యాపారులతో ప్రభుత్వం సంతోషంగా పనిచేయడానికి సిద్ధం. స్ట్రక్చరల్ రిఫార్ములు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని ఆయన అన్నారు.

ఈ చర్చలు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ఊపిరి పోస్తాయని, ఏఐ సాంకేతికతలు ఉద్యోగాలను పెంచుతాయనే ఆత్మవిశ్వాసాన్ని లోకేశ్ వ్యక్తం చేశారు. సమ్మిట్‌లో పాల్గొన్న పెట్టుబడిదారులు, పారిశ్రామికులు ఈ కార్యక్రమానికి స్పందించారు.

Tags:    

Similar News