Minister Nara Lokesh: గర్భిణిపై వైకాపా గూండాల దాడి.. పైశాచిక చర్యే కదా జగన్?
పైశాచిక చర్యే కదా జగన్?
మీ పుట్టినరోజు ప్రజలకు ప్రాణ భయంగా మారింది: మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం
Minister Nara Lokesh: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దౌర్జన్యాలపై ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇంటి ముందు టపాసులు పేల్చొద్దంటే.. శ్రీసత్యసాయి జిల్లాలో ఓ గర్భిణి మహిళపై వైకాపా గూండాలు దాడి చేయడం పైశాచిక చర్య కాదా? ఇలాంటి ఉన్మాదం వల్ల ఆమె ఆరోగ్యం విషమావస్థకు చేరింది’’ అంటూ జగన్‌ను నిలదీశారు.
జగన్ జన్మదిన వేడుకల పేరుతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, ఇటువంటి ఘటనలు ఆపకపోతే పార్టీ నాయకులకు కనీసం హెచ్చరిక చేయరా? అని ప్రశ్నించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ ఆరోపణలు చేస్తూ, రాష్ట్రంలోని వివిధ చోట్ల జరిగిన హింసాత్మక ఘటనల వీడియోలను షేర్ చేశారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో జగన్ ఫ్లెక్సీలకు మూగజీవాలను బలిచ్చి రక్తాభిషేకం చేయడం, పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలో తెదేపా కార్యకర్తలపై కర్రలతో దాడులు, విజయవాడలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనుయాయులు కార్యకర్తల ముఖాలకు కేక్ రాసి అవమానించడం వంటి సంఘటనలను లోకేశ్ ఎత్తిచూపారు.