CM Chandrababu: ఎమ్మెల్యేలు సబ్జెక్టు ప్రిపేర్ అయి అసెంబ్లీకి రావాలి: సీఎం చంద్రబాబు

అసెంబ్లీకి రావాలి: సీఎం చంద్రబాబు

Update: 2026-02-11 11:06 GMT

కూటమి ఐక్యత కొనసాగాలి.. వ్యక్తిగత కక్షలకు అసెంబ్లీ వేదిక చేసుకోకూడదు

CM Chandrababu: కూటమి ఎమ్మెల్యేలు వ్యక్తిగత కక్షలు, ఆవు కథలతో అసెంబ్లీ సమావేశాలను వేదిక చేసుకోకూడదని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు స్పష్టంగా సూచించారు. ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యేలు సబ్జెక్టుపై పూర్తిగా సిద్ధంగా సభకు రావాలని, ప్రజలకు జవాబుదారీగా మాట్లాడాలని ఆదేశించారు.

గత 20 నెలలుగా కూటమి నేతల మధ్య ఐక్యత కొనసాగుతోందని, ఇదే స్థాయి కింది స్థాయిల్లోనూ ఉండాలని ఆయన అన్నారు. జిల్లా స్థాయిలో మూడు పార్టీల నేతలు సమావేశాలు నిర్వహించి ఐక్యతను మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు.

అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై తాను మాట్లాడతానని, 40 మందిని వ్యక్తిగతంగా పిలిపించి చర్చిస్తానని చెప్పారు. ‘‘ఆవు కథలు చెప్పడం మానేయండి. సబ్జెక్టు ప్రిపేర్ అయి సభకు రండి. ఎవరేం మాట్లాడుతున్నారో నేను నోట్ చేసుకుంటాను’’ అని హెచ్చరించారు.

అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రతి ఎమ్మెల్యే హాజరు కావాలని, తాను కూడా రోజూ ఉదయం 11 గంటల నుంచి సెషన్ ముగిసే వరకు అసెంబ్లీలో ఉంటానని తెలిపారు. సభలో మాట్లాడేది 5 కోట్ల మంది ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, అనుకున్న విషయాన్ని 3 నుంచి 7 నిమిషాల్లో స్పష్టంగా చెప్పాలని సూచించారు.

కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న లబ్ధిని ఎప్పటికప్పుడు వివరించాలని ఆదేశించారు. ప్రస్తుతం రూ. లక్ష కోట్లకు పైగా హైవే పనులు, రూ.90 వేల కోట్లకు పైగా రైల్వే పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.450 కోట్ల నష్టంలో ఉండగా, ఇప్పుడు నష్టాలను అధిగమించి రూ.54 కోట్ల లాభాల్లోకి వచ్చిందని శుభపరిణామంగా వర్ణించారు. కేంద్ర ప్రాయోజకత కార్యక్రమాలను రాష్ట్రం బాగా అందిపుచ్చుకోవాలని కోరారు.

అన్ని మతాలను గౌరవించాలని, భక్తుల సెంటిమెంట్‌ను దెబ్బతీయకూడదని చెప్పారు. జగన్‌కు మతాలపై గౌరవం లేనందునే వైకాపా హయాంలో రామతీర్థం సహా అనేక ఆలయాలపై దాడులు జరిగాయని, తిరుమల శ్రీవారి లడ్డూతో పాటు ఎక్కడ వీలైతే అక్కడ కల్తీకి పాల్పడ్డారని విమర్శించారు.

Tags:    

Similar News