CM Chandrababu: నాలుగోసారి భారత ప్రధానిగా మోదీనే: సీఎం చంద్రబాబు

భారత ప్రధానిగా మోదీనే: సీఎం చంద్రబాబు

Update: 2025-09-12 13:27 GMT

CM Chandrababu:  భారతదేశానికి నాలుగోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీనే కొనసాగుతారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. వచ్చే దశాబ్దంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా అద్భుతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు. అమరావతిలో జరిగిన ఒక ప్రైవేట్ కాంక్లేవ్‌లో మాట్లాడుతూ, భావితరాల కోసం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత సీఎంగా తనపై ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

వచ్చే దశాబ్దంలో ఆంధ్రప్రదేశ్‌ రూపురేఖలను రూపొందించే విషయంపై చంద్రబాబు చర్చించారు. "1994లో కఠిన నిర్ణయాలు తీసుకున్నా, 1999లో విజయం సాధించాం. అయితే, ఆ సమయంలో బ్యాలెన్స్ చేయలేకపోయాం. ఇప్పుడు సంపద సృష్టిస్తూనే, పేదలకు అందిస్తున్నాం. భారత ప్రధానిగా మోదీ నాలుగోసారి కొనసాగుతారు, రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది" అని ఆయన స్పష్టం చేశారు.

ఏపీలో స్టేక్‌హోల్డర్లను భాగస్వాములుగా చేస్తూ ఇలాంటి కాంక్లేవ్‌లు నిర్వహించడం సానుకూల పరిణామమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. విజన్ రూపొందించడమే కాకుండా, దాన్ని సాకారం చేసే దిశగా పనిచేయాలని సూచించారు. జాతీయ స్థాయిలో వికసిత్ భారత్-2047, రాష్ట్ర స్థాయిలో స్వర్ణాంధ్ర-2047 డాక్యుమెంట్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. "20-25 ఏళ్ల క్రితం భారతీయులకు సరైన గుర్తింపు లేని సమయంలో తెలుగు వ్యక్తి పీవీ నరసింహారావు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి భారతదేశం అభివృద్ధి అడుగడుగునా ముందుకు సాగుతోంది. 2038 నాటికి భారత్ నెంబర్-1 ఆర్థిక శక్తిగా అవతరిస్తుంది. ఇందులో తెలుగు వారి పాత్ర కీలకంగా ఉండాలి" అని చంద్రబాబు పేర్కొన్నారు.

2028-29 నాటికి రూ.29,29,402 కోట్ల జీఎస్‌డీపీ, 2029-34 నాటికి రూ.57,21,610 కోట్ల జీఎస్‌డీపీ సాధించేలా ప్రణాళికలు రూపొందించామని, 2028-29 నాటికి తలసరి ఆదాయం రూ.5,42,985, 2029-34 నాటికి రూ.10,55,000కు చేరుకుంటామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. "ఇది అసాధ్యం కాదు. నిర్దిష్ట లక్ష్యాలతో ప్రణాళికలు రూపొందించాం. మెగా డ్రీమ్స్, సంకల్పం ఉంటే ఇవన్నీ సాధ్యమే" అని ఆయన అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండూ సమాంతరంగా సాగాలని, సూపర్ సిక్స్ ద్వారా సంక్షేమం అందిస్తూనే, అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని చంద్రబాబు వివరించారు.

Tags:    

Similar News