Rushikonda Beach : రుషికొండ బీచ్ సుందరీకరణకు మరిన్ని చర్యలు
రుషికొండ బీచ్‌ను సందర్శించిన మంత్రి కందుల దుర్గేష్;
- బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ పునరుద్ధరణ తర్వాత పరిశీలన
- బ్లూ ఫ్లాగ్ ప్రమాణాల స్థాయిని కొనసాగిస్తాం..
- సాగర తీరంలో డబుల్ డెక్కర్ బస్సుల పరిశీలన
రుషికొండ బీచ్ లో పర్యాటకులను ఆకట్టుకోవడానికి అన్ని రకాల సుందరీకరణ చర్యలు చేపడతామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. గురువారం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖ జిల్లా కలెక్టర్ హరీంధిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తో కలిసి విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ లో మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ లో సౌకర్యాలను పరిశీలించారు. బీచ్ లో దుకాణాలు నడుపుతున్నవాళ్లు, లైఫ్ గార్డులు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలకు తగిన పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. బీచ్ లో బ్లూ ఫ్లాగ్ ప్రమాణాల స్థాయిని కొనసాగించడమే కాకుండా బీచ్ సుందరీకరణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అదే విధంగా బీచ్ లో పర్యాటక సందడి పెరగడానికి అవసరమైన చర్యలపై చర్చించామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అనంతరం బీచ్ రోడ్డులో తిరగనున్న డబుల్ డెక్కర్ ఈవీ బస్సులను పరిశీలించారు. పర్యాటక ఆకర్షణగా నిలవబోతున్న హప్ ఆన్, హప్ ఆఫ్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు త్వరలోనే విశాఖ నగరంలో సేవలందించనున్నాయని తెలిపారు. డబులు డెక్కర్ బస్సులు విశాఖ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో తీసుకెళ్తుందని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.