TTD Executive Officer: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కార్యనిర్వహణాధికారి (ఈవో)గా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

ఆలయ క్షేత్ర సంప్రదాయాలను పాటిస్తూ ముద్దాడ రవిచంద్ర దంపతులు ముందుగా భూవరాహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వైకుంఠం క్యూకాంప్లెక్స్-1 గుండా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ తితిదే అదనపు ఈవో వెంకయ్యచౌదరి, ఇతర అధికారులు వారిని స్వాగతించారు.

రంగనాయకుల మండపంలో నూతన ఈవోగా రవిచంద్ర పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత తితిదే బోర్డు ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి, శ్రీవారి మూలవిగ్రహ దర్శనం చేసుకున్నారు. వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, అదనపు ఈవో వెంకయ్యచౌదరి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.

ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడిన రవిచంద్ర, తాను శ్రీవారి భక్తుడిగా ఉండటం వల్ల సహచర భక్తులకు సేవ చేసే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. హిందువుల నమ్మకాలను, భక్తి విశ్వాసాలను కాపాడుతూ పనిచేస్తానని, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆ తర్వాత అన్నమయ్య భవనం, తిరుపతిలోని పరిపాలన భవనంలో వివిధ విభాగాధిపతులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెడతానని ఆయన స్పష్టం చేశారు. 

Tags: