Minister Nara Lokesh: ప్రభుత్వ పాఠశాలల్లో 'నో అడ్మిషన్' బోర్డులు పెట్టే స్థాయికి తీసుకెళ్లడమే నా లక్ష్యం: మంత్రి నారా లోకేశ్
'నో అడ్మిషన్' బోర్డులు పెట్టే స్థాయికి తీసుకెళ్లడమే నా లక్ష్యం: మంత్రి నారా లోకేశ్
Minister Nara Lokesh: ‘మన బడి-మన భవిష్యత్తు’ కార్యక్రమం కింద విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల నియామకం, పాఠశాల గదుల నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రాథమిక పాఠశాలలను ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేసే అంశంపై శాసనసభలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
‘‘యువగళం పాదయాత్ర సమయంలో ఉపాధ్యాయులు అనేక సమస్యలను నా దృష్టికి తెచ్చారు. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలన్నది మా లక్ష్యం. పాఠశాల భవనాల నిర్మాణం కోసం దాతల సహకారం కోరుతున్నాం. ఈ భవనాలపై దాతల పేర్లు ఉండేలా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నది మా ఉద్దేశం. అన్ని ప్రభుత్వ బడుల్లో సీట్లు నిండి, ‘నో అడ్మిషన్’ బోర్డులు పెట్టే స్థాయికి చేరుకోవాలన్నదే నా లక్ష్యం. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు వంద పాఠశాలల్లో ఈ పరిస్థితి ఉంది’’ అని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.