N. Chandrababu Naidu: కొత్త పోర్టుల్లో త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించాలి: సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు
సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు
N. Chandrababu Naidu: రాష్ట్రంలోని వివిధ పోర్టుల నుంచి కార్గో హ్యాండ్లింగ్ ఆపరేషన్ల ద్వారా తూర్పు-పశ్చిమ కార్గో కారిడార్‌గా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల్లో త్వరగా కార్గో హ్యాండ్లింగ్ కార్యకలాపాలు ప్రారంభించాలని సూచించారు.
పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ సీఎం “మూడు కొత్త పోర్టుల నుంచి పొరుగు రాష్ట్రాలకు కార్గో రవాణా సాధ్యం కావాలంటే తగిన చర్యలు చేపట్టండి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రిఫైనరీ ఏర్పాటు అయిన తర్వాత రామాయపట్నం పోర్టు కంటైనర్, బల్క్ కార్గో పోర్టుగా మారుతుంది. దీని నుంచి కడప స్టీల్ ప్లాంట్ వరకు ప్రత్యేక రైల్వే మార్గం వేయడానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది” అని వివరించారు.
మూడు పోర్టుల సమీపంలో టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేయడం ద్వారా వాణిజ్య లావాదేవీలు పెరుగుతాయని, పోర్టుల చుట్టూ పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి చెందే అవకాశం ఉందని సీఎం తెలిపారు. రెండో దశలో ప్రతిపాదించిన బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
“సమీప భవిష్యత్తులో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక్క పోర్టు లేదా ఫిషింగ్ హార్బరు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో తూర్పు తీర లాజిస్టిక్స్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ మారుతుంది. ఏపీలోని పోర్టులు కార్గో హ్యాండ్లింగ్‌లో గేమ్ చేంజర్‌గా మారాలి. ప్రస్తుతం యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల ఓడరేవులు ఇబ్బందుల్లో పడ్డాయి. ఇప్పుడు భారత్ తూర్పు తీర పోర్టులే సురక్షితమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు 2026 డిసెంబరు నాటికి పూర్తి అవుతాయని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, మారిటైమ్ బోర్డు సీఈవో అభిషేక్ కుమార్ పాల్గొన్నారు.
ఈ అభివృద్ధి పనులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసి, ఉపాధి అవకాశాలు పెంచుతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.