CM N. Chandrababu Naidu: డిసెంబర్‌లోగా మరో 4.50 లక్షల ఇళ్లు పేదలకు అందిస్తాం: సీఎం చంద్రబాబు

4.50 లక్షల ఇళ్లు పేదలకు అందిస్తాం: సీఎం చంద్రబాబు

Update: 2026-03-30 10:52 GMT

CM N. Chandrababu Naidu: పేద కుటుంబాలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడమే తన ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి గృహప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 2.50 లక్షల గృహప్రవేశాలు జరుగుతున్నాయని చెప్పారు.

తిరుపతి జిల్లాలోనే 15,659 ఇళ్లు నిర్మించి ప్రజలకు అందిస్తున్నామని సీఎం వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 5.50 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చామని, డిసెంబర్‌లోగా మరో 4.50 లక్షల ఇళ్లు కట్టించి పేదలకు అందించనున్నట్లు ప్రకటించారు.

తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా పుదూరు టిడ్కో ఇళ్ల సముదాయంలో గృహప్రవేశ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు, ఇతర మౌలిక సదుపాయాలతో ఆధునికంగా నిర్మించిన ఈ గృహ సముదాయాలు పేదల జీవనం మార్చనున్నాయి.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు, గత ప్రభుత్వం అర్బన్ హౌసింగ్ పథకం కింద కేంద్రం ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేసిందని తీవ్ర విమర్శలు చేశారు. రూ.816 కోట్లు అప్పులు చేసి నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించడానికి ప్రయత్నించి, పేదలను ఇబ్బందుల పాలు చేసిందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును నాశనం చేసిందని కూడా గుర్తు చేశారు.

అయితే తమ ప్రభుత్వం సుపరిపాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతోందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని, ఏపీ సుదీర్ఘ తీరప్రాంతాన్ని మత్స్యకారుల సంక్షేమం కోసం వినియోగించుకుంటామని తెలిపారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని రూ.20 వేలకు పెంచామని చెప్పారు.

సాంకేతికతను అన్ని రంగాల్లో అనుసంధానం చేస్తూ ‘మనమిత్ర’, ‘వాట్సప్ గవర్నెన్స్’ వంటి వినూత్న కార్యక్రమాలు తీసుకొచ్చామని వివరించారు. నిన్నటి రోజు అమరావతి రాజధాని అభివృద్ధి తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్లు తెలిపారు. చట్టం రూపుదాల్చాక రాజధానిని ఎవరూ కదల్చలేరని, హైదరాబాద్, చెన్నై కంటే అమరావతిని నంబర్ వన్‌గా నిలబెడతామని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

63 లక్షల మందికి మొదటి తేదీనే పింఛన్లు అందిస్తున్నామని, తల్లులకు పిల్లల సంఖ్య ఎంతైనా ‘వందనం’ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. స్త్రీశక్తి కింద మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలను కూడా సమన్వయంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News