AP Cabinet Meeting: కొత్త జిల్లాలు పోలవరం, మార్కాపురం.. అన్నమయ్యకు మదనపల్లె కేంద్రం
అన్నమయ్యకు మదనపల్లె కేంద్రం
26 నుంచి 28కి జిల్లాల సంఖ్య
కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు.. పలు మార్పులు, చేర్పులు
డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్.. జనవరి 1 నుంచి అమలు
AP Cabinet Meeting:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా పోలవరం, మార్కాపురం జిల్లాలను ఏర్పాటు చేయడంతోపాటు అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా రాజంపేట నియోజకవర్గాన్ని వైఎస్సార్ కడప జిల్లాలోకి, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలోకి చేర్చనున్నారు. రాయచోటి నియోజకవర్గం మాత్రం అన్నమయ్య జిల్లాలోనే కొనసాగనుంది.
సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై విస్తృత చర్చ జరిగింది. ప్రజల నుంచి వచ్చిన సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. కొత్తగా ఏర్పడే 5 రెవెన్యూ డివిజన్లతోపాటు కర్నూలు జిల్లాలోని ఆదోని మండలాన్ని రెండుగా విభజించే ప్రతిపాదనకు కూడా ఆమోదముద్ర పడింది.
పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండ గ్రామ పేరును 'వాసవీ పెనుగొండ'గా మార్చనున్నారు. గూడూరు నియోజకవర్గంలోని మూడు మండలాలను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోకి చేరుస్తూ నిర్ణయించారు. అలాగే కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో విలీనం చేయనున్నారు.
తిరుపతి జిల్లాలోని గూడూరు రెవెన్యూ డివిజన్‌లో మార్పులు చేస్తూ.. గూడూరు, చిల్లకూరు, కోట మండలాలను నెల్లూరు జిల్లాలోకి కలుపుతారు. మిగతా మండలాలను సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి డివిజన్లలో చేరుస్తారు.
ఇతర మార్పులు:
అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి కొన్ని మండలాలను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం డివిజన్‌లోకి.
శ్రీకాకుళం, కాకినాడ, అనకాపల్లి, కనిగిరి, బాపట్ల, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనూ పలు మండలాల మార్పులు, చేర్పులు.
ఈ మార్పులతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26 నుంచి 28కి చేరనుంది. డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ జారీ చేసి, 2026 జనవరి 1 నుంచి కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తుంది. ఈ నిర్ణయాలు పరిపాలనా సౌలభ్యం, ప్రజల అవసరాల దృష్ట్యా తీసుకున్నవని మంత్రులు తెలిపారు.