Minister Nara Lokesh: అక్టోబర్ నుంచి అర్హులందరికీ కొత్త పెన్షన్లు – మంత్రి నారా లోకేశ్
మంత్రి నారా లోకేశ్
Minister Nara Lokesh: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ దశలవారీగా కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ అర్హులకు పింఛన్లు అందించాలని మంత్రులకు సూచించారు.
కేబినెట్ సమావేశానికి ముందు మంత్రులతో సమావేశమైన లోకేశ్ పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు పూర్తిస్థాయిలో సిద్ధమై అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. అక్టోబర్‌లోగా స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని, ఎన్నికలు వాయిదా పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న అంశాలను త్వరగా పరిష్కరించి అన్ని స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. మొదట పురపాలక, తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ, అనంతరం పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.
స్థానిక ఎన్నికలు వాయిదా పడితే ఫైనాన్స్ కమిషన్ నిధులు నిలిచిపోయి రాష్ట్రానికి నష్టం జరుగుతుందనే దురుద్దేశంతో ప్రతిపక్షం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. విద్యాశాఖను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న కుట్రలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మాట వినని అధికారులు, శాఖకు లేదా మంత్రికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించే అధికారుల విషయంలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుందామని చెప్పారు. ఇటీవల కొన్ని సమస్యలు ఒకరిద్దరు అధికారుల పనితీరుతోనే ఉత్పన్నమయ్యాయని అభిప్రాయపడ్డారు.
వైద్య రంగంలో చిన్న పొరపాటు జరిగినా సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ జరుగుతోందని, ఇలాంటి అంశాలపై కూడా మంత్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెప్టెంబర్ 9న అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి అన్యాయంగా నిర్బంధించి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాలని లోకేశ్ సూచించారు. నాటి దుశ్చర్య నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తీరును ప్రజలకు గుర్తు చేసేలా కార్యక్రమం ఉండాలన్నారు.
ఎల్‌నినో ప్రభావం వల్ల నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికలు, పొదుపు చర్యలతో సమస్యను అధిగమిద్దామని కూడా సూచించారు.