Ex Minister Peddireddy : మాపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు
రాజమండ్రీ సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డిని కలిసిన పెద్దిరెడ్డి;
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలందరినీ టార్గెట్ చేస్తోందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన రాజమండ్రీ సెంట్రల్ జైలులో ఉన్న తన కుమారుడు రాజంపేట వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖాత్ అయ్యారు. ఎంపీ మిథున్ రెడ్డిని కలసిన అనంతరం సెంట్రల్ జైలు వెలుపల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజా ప్రతినిధులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన సౌకర్యాలు ఏవీ సెంట్రల్ జైలు అధికారులు మిథున్ రెడ్డికి కల్పించడం లేదని ఆరోపించారు. ప్రజాప్రతినిధులను టెర్రరిస్టులుగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని అలా ట్రీట్ చెయ్యడం ఎంతవరకూ సరైనదని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. మిథున్ రెడ్డి అరెస్ట్ తో ప్రభుత్వం ఎంతటి కక్షపూరితంగా వ్యవహరిస్తోందో అర్ధమవుతోందన్నారు. మిథున్ రెడ్డి ఎటువంటి ఇబ్బందులైనా ఎదుర్కొంటాడని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. జైలులో ఉన్న మిథున్ రెడ్డికి భోజనం ఒక్కపూటే పంపడానికి అనుమతిస్తున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
మాజీ హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ మాఎంపీ మిథున్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ఎంపీపై లేనిపోని నిందలు మోపారన్నారు. పార్టీ మిథున్ రెడ్డికి అండగా ఉంటుందన్నారు. మిథున్ రెడ్డి అరెస్ట్ ద్వారా కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు. మా ప్రభుత్వ హయాంలో మద్యం దుకాణాలను 30 శాతం తగ్గించామని, రాష్ట్రంలో ఒక్క బెల్ట్ షాపు లేకుండా కఠిన చర్యలు తీసుకున్నామని, ఇటువంటి సందర్భంలో అవినీతి ఎలా జరుగుతుందని మాజీ మంత్రి తానేటి వనిత ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలోనే భారీ లిక్కర్ స్కామ్ జరుగుతోందని వనిత ఆరోపించారు.