Palle Pandaga 3.0: పల్లెలకు కొత్త ఊపిరి.. జగన్ హయాంలో ఛిద్రమైన గ్రామాలకు పట్టాభిషేకం
పట్టాభిషేకం
పల్లె పండగ 3.0తో రూ.11,085 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ నెల్లూరులో
Palle Pandaga 3.0: వైకాపా ప్రభుత్వ హయాంలో విధ్వంసానికి గురైన గ్రామాలకు కూటమి ప్రభుత్వం కొత్త జీవం పోస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంలో జరిగిన పల్లె పండగ 3.0 ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌తో కలిసి రూ.11,085 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు.
‘‘జగన్ హయాంలో గ్రామాలు ఛిద్రమైపోయాయి. రోడ్లన్నీ దెబ్బతిని గ్రామాల్లోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. పంచాయతీల్లో బ్లీచింగ్‌కు కూడా డబ్బుల్లేకుండా చేశారు. అలాంటి దారుణ పరిస్థితుల నుంచి కూటమి ప్రభుత్వం గ్రామాల్లో అనేక మార్పులు తీసుకొచ్చింది’’ అని సీఎం అన్నారు. వైకాపా ఐదేళ్లలో కేవలం 880 కిలోమీటర్ల రోడ్లు వేస్తే, గత రెండేళ్లలోనే 6,500 కి.మీ. సిమెంట్ రోడ్లు వేసి చరిత్ర సృష్టించామని గర్వంగా చెప్పుకున్నారు. ‘‘గత ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బులు వైకాపా దొంగల జేబుల్లోకి వెళ్లాయి. మేం చేసిన పని మీ కళ్ల ముందు కనిపిస్తోంది’’ అని సవాలు విసిరారు.
పల్లె పండగ 3.0లో 15,500 కిలోమీటర్ల బీటీ, సీసీ రోడ్లు వేస్తున్నామని, రూ.2,700 కోట్లతో 6 వేల కి.మీ. సిమెంట్ రోడ్లు నిర్మిస్తున్నామని వివరించారు. ప్రతి ఇంటి ముందు సిమెంట్ రోడ్డు, ఆవులు-గేదెల కోసం మినీ గోకులాలు, వెయ్యి కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రెయిన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఐదేళ్లలో రూ.1.30 లక్షల కోట్లతో ప్రతి గ్రామంలో రోడ్లు, కాలువలు, వీధి దీపాలు, తాగునీరు వంటి సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే నెల 5న జేజేఎం-పొట్టిశ్రీరాములు జలధార కింద రూ.30 వేల కోట్ల పనులకు శ్రీకారం చుట్టబోతున్నామని తెలిపారు.
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ నాయకత్వంలో ఇప్పటికే మూడు పల్లె పండగలు విజయవంతంగా నిర్వహించామని సీఎం ప్రశంసించారు. 2024 ఆగస్టు 23న 13,326 గ్రామసభలు ఒకేసారి నిర్వహించి అభివృద్ధికి శ్రీకారం చుట్టారని, రెండున్నర దశాబ్దాల తర్వాత పంచాయతీరాజ్ శాఖలో పది వేల మందికి పదోన్నతులు కల్పించారని గుర్తు చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధుల్లో గత రెండేళ్లలో రూ.4,136 కోట్లు పంచాయతీలకు విడుదల చేశామని, లక్షకు పైగా పంట కుంటలు, పశువుల షెడ్లు, నీటి తొట్టెలు నిర్మించి గ్రామీణాభివృద్ధికి పవన్‌కల్యాణ్ దోహదం చేశారని అన్నారు. జాతీయ స్థాయిలో 13 అవార్డులు సాధించిన ఘనత డిప్యూటీ సీఎం శాఖకే దక్కిందని గర్వించారు.
ప్రతి కుటుంబానికి ఇల్లు/ఇంటి స్థలం, విద్యుత్తు, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, కుళాయి నీరు, ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే నెల 4న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో 3 లక్షల గ్రామీణ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నామని చెప్పారు. రెండేళ్ల క్రితం అధికారం చేపట్టినప్పుడు రూ.10 లక్షల కోట్ల అప్పు వారసత్వంగా వచ్చినా సూపర్ సిక్స్ అమలు చేసి మాట నిలబెట్టుకున్నామని, ఏడాదికి రూ.33 వేల కోట్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇచ్చే ప్రపంచంలోనే ఏకైక ప్రభుత్వం ఇదేనని గర్వంగా చెప్పుకున్నారు. అన్నదాత సుఖీభవ అమలుతో రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని అనగానే సభలో రైతులు పచ్చ కండువాలు ఎగరేసి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
వెలిగొండ ఫేజ్-2 పూర్తి చేసి నెల్లూరు, మార్కాపురం జిల్లాలకు కృష్ణా నీళ్లు తీసుకొస్తామని, ఎల్‌నినో వంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. నెల్లూరు జిల్లా రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా నిలవనుందని, అధికారులు బాగా పనిచేస్తే దండలు, లేదంటే దండన తప్పదని హెచ్చరించారు. ‘‘ప్రజలు లేకపోతే మీరూ మేమూ లేం. మనం పెత్తందారులం కాదు.. సేవకులం’’ అని అధికారులకు స్పష్టం చేశారు.
2024 కంటే కూటమికి ఆదరణ పెరిగిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమినే గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాలను నేరమయం చేసిందెవరో, అదే రాజకీయాలతో ప్రజల జీవితాలను మార్చేవారెవరో గమనించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘ఇక్కడ ఉన్నది సీబీఎన్, పవన్‌కల్యాణ్, నరేంద్ర మోదీ. అభివృద్ధికి ఎవరైనా అడ్డమొస్తే ఉపేక్షించబోం’’ అని హెచ్చరించారు.