Minister Satya Kumar: ప్రభుత్వ ఆసుపత్రుల్లో హృద్రోగ చికిత్సకు రూ.34 కోట్ల పరికరాలు.. నాణ్యమైన వైద్యం అందుతుందని మంత్రి సత్యకుమార్
మంత్రి సత్యకుమార్
Minister Satya Kumar: ప్రభుత్వ బోధనా ఆసుపత్రుల్లో గుండె సంబంధిత వైద్య సేవలను విస్తరించి పేదలకు నాణ్యమైన చికిత్స అందిస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో హృద్రోగ చికిత్సల కోసం రూ.34 కోట్లతో ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వరల్డ్ హార్ట్ డే (సెప్టెంబర్ 29) సందర్భంగా రాష్ట్రంలో హృద్రోగ పీడితులకు అందిస్తున్న సేవల వివరాలను సోమవారం ఒక ప్రకటనలో మంత్రి వివరించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఎనిమిది క్యాథ్‌ల్యాబ్‌లు పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. రూ.18 కోట్లతో తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం ప్రభుత్వ బోధనా ఆసుపత్రుల్లో కొత్త క్యాథ్‌ల్యాబ్‌ల ఏర్పాటు టెండర్ల దశలో ఉందన్నారు. రూ.10 కోట్లతో తిరుపతి, కడప, అనంతపురం, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాలుగు హార్ట్-లంగ్ యంత్రాలు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. కర్నూలు, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక 2డీ ఎకో మిషన్లకు రూ.2 కోట్లు, ఐసీయూ మానిటర్లు, ఇతర పరికరాలకు రూ.4 కోట్లు వెచ్చిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
రాయలసీమ ప్రజల సౌకర్యార్థం అనంతపురంలో త్వరలో ఓపెన్ హార్ట్ సర్జరీ సేవలు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. కాకినాడలో ఒక కార్పొరేట్ సంస్థ ద్వారా 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో హార్ట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని కూడా వివరించారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 2024 నుంచి ఇప్పటి వరకు రూ.1,767.79 కోట్ల విలువైన ఉచిత వైద్యం హృద్రోగులకు అందినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు.