Pawan Kalyan: జగన్కు పవన్ కల్యాణ్ సవాలు: ‘మీరు 2.0 చూపిస్తే మేం 10X చూపిస్తాం’
మేం 10X చూపిస్తాం’
Pawan Kalyan: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన స్పష్టంగా సవాలు విసిరారు.
“మీరు 2.0 చూపిస్తే మేం 10X చూపిస్తాం. మీరు ఇలా మాట్లాడితేనే 2019లో ప్రజలు గుణపాఠం చెప్పారు” అని పవన్ కల్యాణ్ అన్నారు. జగన్ బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. బలహీనులు మాత్రమే ఇలా మాట్లాడుతారని, బలవంతులు ఎవరూ ఇలా మాట్లాడరని ఆయన వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు జగన్ జనజీవన స్రవంతిలోకి రావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. అప్పుడే ఆయనకు ప్రజల మనోభావాలు అర్థమవుతాయని హితవు చెప్పారు.
రాష్ట్రాభివృద్ధి కోసం కూటమిగానే ఉంటామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సవాళ్లు వేరే విధంగా ఉంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో సవాళ్లు వేరే విధంగా ఉంటాయని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కొన్ని స్థానాలకు మాత్రమే ఉంటుందని, ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ఎక్కువ స్థానాలకు సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. క్లిష్టతరమైనా రాష్ట్రాభివృద్ధి కోసం కూటమిగానే ముందుకు సాగుతామని నొక్కి చెప్పారు.
ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో అభివృద్ధికి సంబంధించిన అంశాలే ప్రధానంగా ఉన్నాయని, పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయని కూడా పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.