వైఎస్సార్‌ కడప జిల్లా స్థానిక ఎన్నికల్లో జగన్‌కు పెనుషాక్‌


YSRCP: వైఎస్సార్‌ కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు వైకాపాకు భారీ ఎదురుదెబ్బ తగిలాయి. కడప నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని ఎనిమిది పురపాలక సంఘాల్లో ఎన్నికలు జరుగుతుండగా.. ఆరు పురపాలక సంఘాల్లో కూటమి తిరుగులేని విజయం సాధించింది. ఏకగ్రీవాల సరళి చూస్తే వైకాపా క్షేత్రస్థాయిలో పట్టు కోల్పోతున్నట్లు స్పష్టమవుతోంది.


వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ సొంత నియోజకవర్గమైన పులివెందులలో మొత్తం 40 వార్డులు ఉండగా, 20 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధించారు. కడప నగరపాలక సంస్థలో 66 డివిజన్లు ఉండగా 50 డివిజన్లు ఏకగ్రీవం కాగా, అందులో తెదేపా 47, జనసేన ఒకటి, భాజపా రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయి. వైకాపా ఖాతా మాత్రం ఖాళీగానే ఉంది.


బద్వేలు పురపాలికలో 40 వార్డులకు గానూ 39 కూటమికి ఏకగ్రీవమయ్యాయి. తెదేపా అభ్యర్థి ఎస్‌.దివ్యతేజ ఛైర్‌పర్సన్‌ స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రొద్దుటూరులో 52 వార్డులకు గానూ 52 చోట్ల తెదేపా ఏకగ్రీవంగా క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఛైర్‌పర్సన్‌ స్థానాన్ని రాఘవరెడ్డి సొంతం చేసుకున్నారు. కమలాపురంలో మొత్తం 23 స్థానాలూ ఏకగ్రీవమయ్యాయి. ఛైర్‌పర్సన్‌గా జి.స్వప్న (తెదేపా) విజయం సాధించారు.


ఎర్రగుంట్ల పురపాలికను భాజపా సొంతం చేసుకుంది. 28 వార్డులకు 27 స్థానాలు ఏకగ్రీవం కాగా.. తెదేపా 18, భాజపా 9 స్థానాలు పొందాయి. ఛైర్‌పర్సన్‌ పీఠాన్ని మధులత (భాజపా) దక్కించుకున్నారు. మైదుకూరులో 32 వార్డులకు 17 ఏకగ్రీవం కాగా.. తెదేపా 16, జనసేన ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఛైర్మన్‌గా ధనపాల్‌ జగన్మోహన్‌ (తెదేపా) విజయం సాధించారు. రాజంపేటలో 32 వార్డులకు 15 ఏకగ్రీవంగా కాగా.. తెదేపా 12, జనసేన ఒకటి, భాజపా ఒకటి, ఇండిపెండెంట్‌ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. దొంతం గాయత్రి (తెదేపా) ఛైర్‌పర్సన్‌ పీఠాన్ని కైవసం చేసుకున్నారు.


జమ్మలమడుగు, పులివెందులలో ఛైర్‌పర్సన్‌ స్థానాలకు, కడపలో మేయర్‌ స్థానాలకు మాత్రమే పోలింగ్‌ జరగనుంది.


జడ్పీటీసీ స్థానాల్లోనూ కూటమిదే హవా. జిల్లాలోని మొత్తం 39 జడ్పీటీసీ స్థానాలకు గానూ తొమ్మిది ఏకగ్రీవమైనట్లు స్పష్టత వచ్చింది. నామినేషన్ల ఉపసంహరణ నాటికి ఈ సంఖ్య మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.

Tags: