Pawan Kalyan: వైకాపా మళ్లీ రాదు.. వచ్చినా ఏమీ చేయలేదు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
వచ్చినా ఏమీ చేయలేదు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Pawan Kalyan: రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా వ్యవహరించలేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు సరైన కార్యాలయాలు కూడా లేవని, అయినప్పటికీ చంద్రబాబు నాయుడు బలమైన ఆశావాదిగా టెంటు వేసుకునైనా పని చేద్దామని ఆశించారని వ్యాఖ్యానించారు.
అమరావతిని రాజధానిగా చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరే తీర్మానంపై శాసనసభలో చర్చ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. “రాష్ట్రం ఏర్పడి ఎన్నో సంవత్సరాలు అయినా ఇప్పటికీ రాజధాని సమస్య కోసం కొట్టుకుంటున్నాం. రాజధాని లేదు, సరైన హైకోర్టు కూడా లేదని ఆలోచిస్తే బాధ కలుగుతోంది” అని అన్నారు.
అభివృద్ధికి రాజకీయ స్థిరత్వం చాలా అవసరమని పేర్కొన్న ఆయన, తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు అనే భావన తనకు ఎప్పుడూ లేదని, తెలుగునేల భావనతోనే ఆలోచించేవాడినని చెప్పారు. 2014లో ఏపీపై ఉన్న గౌరవం వల్లే చంద్రబాబుకు మద్దతు ఇచ్చానని గుర్తు చేశారు.
రాజధాని అమరావతి కోసం మెజారిటీ రైతులు ఇష్టపూర్వకంగా భూములు ఇచ్చారని, ఎలాంటి గొడవలు లేకుండా 33 వేల ఎకరాలు సేకరించారని పవన్ కల్యాణ్ వివరించారు. కానీ 2019లో ప్రభుత్వం మారాక అమరావతిపై కక్ష సాధించారని మండిపడ్డారు. అమరావతి రైతులకు మద్దతుగా తాను వెళ్లానని తెలిపారు.
వైకాపా ప్రభుత్వం మళ్లీ రాదని, వచ్చినా ఏమీ చేయలేదని స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం, రాజధాని అంశంపై రాజకీయాలు చేయకుండా అభివృద్ధి మార్గంలో ముందుకు సాగాలని సూచించారు.