Pawan Kalyan Slams: కొందరు ప్రజా ప్రతినిధులపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, వారిలో ఎంత చెప్పినా మార్పు రావడం లేదని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరోపణలు పెరిగి సీఎం చంద్రబాబు హెచ్చరించే పరిస్థితి ఎందుకు వస్తోందని నిలదీశారు.

మంగళవారం విజయవాడలో జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కొందరు ఎమ్మెల్యేలు పరిశ్రమల్లో జరిగే చిన్నపాటి ప్రమాదాలను బూచిగా చూపి బెదిరించడం, ప్రజా ప్రతినిధులు వసూళ్లు చేస్తున్నారని పరిశ్రమల నుంచి ఆరోపణలు వస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

“రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడానికి మేము ఎంతో కష్టపడుతున్నాం. మిమ్మల్ని నమ్మి టిక్కెట్లు ఇచ్చాం. ఇలా చేస్తే పార్టీ గౌరవానికి భంగం కలిగించిన వారవుతారు” అని పవన్ కల్యాణ్ స్పష్టంగా హెచ్చరించారు.

అంతేకాకుండా, పార్టీ సభ్యత్వ నమోదులో కొందరు ప్రజా ప్రతినిధులు వెనకబడుతున్నారని ప్రశ్నించిన పవన్ కల్యాణ్, “ఎందుకు చేయలేకపోతున్నారు? ఎన్నికల్లో ఎక్కువ టిక్కెట్లు కావాలంటే సభ్యత్వం మరింత పెరగాలి. సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి” అని సూచించారు.

ఈ సమావేశంలో పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు తమ బాధ్యతలు సరిగా నిర్వర్తించాలని, అవినీతి ఆరోపణలకు తావు లేకుండా పని చేయాలని పవన్ కల్యాణ్ స్పష్టమైన సందేశం ఇచ్చారు.

Tags: