రాష్ట్రంలో తాగునీటి ప్రాజెక్టులు ఊపందుకుంటున్నాయి

Pawan Kalyan: ప్రతి ఒక్క నీటి బొట్టును ఆదా చేసుకుని భవిష్యత్ తరాలకు సురక్షితంగా అందించాలని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రజలందరికీ పిలుపునిచ్చారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ఆదివారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన ఈ విషయమై మాట్లాడారు.

నీటి సంరక్షణ అత్యంత ముఖ్యమైన అంశమని, దాని ప్రాముఖ్యతను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతోందని ఆయన వివరించారు. జలజీవన్ మిషన్, ఉపాధి హామీ పథకాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా జల సంరక్షణ పనులు జరుగుతున్నాయన్నారు. తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు పెద్ద ఎత్తున ప్రాజెక్టులు చేపడుతున్నట్లు తెలిపారు.

గత 20 నెలల్లో ఒక టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం కలిగిన 1,06,788 వ్యవసాయ కుంటలు, 13,500 పశువుల తొట్టెల నిర్మాణం పూర్తయిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అదే విధంగా 1.46 కోట్ల జనాభాకు తాగునీరు అందించేలా రూ.9,441 కోట్లతో 8 మల్టీ విలేజ్ నీటి పథకాల పనులు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే మరో ఏడు మల్టీ విలేజ్ పథకాలు రూ.9,355 కోట్లతో ప్రారంభం కానున్నాయి.

తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న మరో 3 వేల గ్రామాల్లో 38.54 లక్షల మందికి లబ్ధి చేకూరేలా రూ.1,814.71 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.

నీటిని సద్వినియోగం చేసుకోవడం, వృథా చేయకుండా ఆదా చేసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఉపముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రయత్నాలతో పాటు ప్రజల సహకారం ఉంటేనే నీటి సమస్యలను పూర్తిగా అధిగమించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

Tags: