CM Chandrababu: పట్టణాలు-పల్లెలు తేడాలేకుండా కూటమికి ప్రజల నీరాజనం: సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు
CM Chandrababu: రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్థానిక ఎన్నికల ఫలితాలపై మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే కూటమికి ప్రజాదరణ మరింత పెరిగిందని వివరించారు.
స్థానిక ఎన్నికల్లో కూటమికి 58.90 శాతం ఓట్లు వచ్చాయని, వైఎస్సార్సీపీకి 33.56 శాతం ఓట్లు వచ్చాయని చంద్రబాబు తెలిపారు. 2024 ఎన్నికలతో పోల్చితే వైఎస్సార్సీపీ ఓట్లు 6.25 శాతం తగ్గాయని, కూటమి మెజారిటీ దాదాపు 25.34 శాతంగా ఉందని ఆయన వెల్లడించారు. పట్టణాల్లో కూటమికి 59.9 శాతం ఓట్లు వచ్చాయని పేర్కొన్నారు.
“రెండున్నరేళ్ల పాలన తర్వాత ప్రజా స్పందనకు ఇదో ఉదాహరణ. మంచి రాజకీయాలు సుపరిపాలనకు నాంది అనే నమ్మకం మరోసారి రుజువైంది. పట్టణాల్లో కూటమి 94 శాతం స్ట్రయిక్‌రేట్ సాధించింది. జడ్పీటీసీల్లో కూటమి స్ట్రయిక్‌రేట్ 87.5 శాతంగా ఉంది. ఎంపీటీసీల్లో 90 శాతానికి పైగా కూటమి గెలుచుకుంది. పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా కూటమికి ప్రజలు నీరాజనం పలికారు” అని చంద్రబాబు వివరించారు.
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయని ఆయన అన్నారు. కడప జిల్లాలో రౌడీ రాజకీయం అంతమైందని, అక్కడి 9 పట్టణ స్థానిక సంస్థలు కూటమికే దక్కాయని గుర్తు చేశారు. “స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే ఫలితాలు ఇలాగే ఉంటాయి. గొడ్డలి పార్టీ హిట్ అండ్ రన్ రాజకీయాలకు కాలం చెల్లింది” అని చంద్రబాబు స్పష్టం చేశారు.