Minister Nara Lokesh: రాప్తాడు బాలిక గోపిక ఆరోగ్యం నిలకడగా ఉంది: మంత్రి నారా లోకేశ్
మంత్రి నారా లోకేశ్
Minister Nara Lokesh: అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎలక్ట్రిక్ రంపంతో జరిగిన దారుణ దాడిలో తీవ్రంగా గాయపడిన పదో తరగతి విద్యార్థిని గోపిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ప్రస్తుతం ప్రశాంతంగా నిద్రపోతూ, క్రమంగా ఆహారం తీసుకుంటోంది. ఫిజియోథెరపీ, కదలికలకు సంబంధించిన వ్యాయామాల్లో చురుగ్గా పాల్గొంటోంది.
మంత్రి లోకేశ్ తన ఎక్స్ పోస్టులో ఇలా పేర్కొన్నారు: ‘‘శస్త్రచికిత్స, ఇన్ఫెక్షన్ నియంత్రణ విభాగాలతో పాటు ఇతర వైద్య బృందాలు బాలిక ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ఆమె కోలుకుంటున్న తీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఆపరేషన్ థియేటర్లో డ్రెస్సింగ్ అనంతరం వార్డుకు తరలించాలని వైద్యులు నిర్ణయించారు. బాలికకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న వైద్య బృందానికి కృతజ్ఞతలు.’’