Pulivendula Satishreddy : హమీలన్నీ అమలు చేశామంటే ప్రజలు అవాక్కవుతున్నారు
కూటమి సర్కార్‌పై మండిపడ్డ పులివెందుల సతీష్ రెడ్డి;
ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసేశామని కూటమి ప్రభుత్వం చెపుతుంటే ప్రజలు ఆశ్చర్యచకితులవుతూ దిగ్భ్రాంతికి గురవుతున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ తమ తొలి ప్రాధాన్యత సూపర్ సిక్సు అని చెప్పిన కూటమి ప్రభుత్వం ఆ హామీలను అమలు చెయ్యకుండనే చేసేశాం అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పథకాల అమలు గురించి మాట్లాడితే వారి నాలుక మందం అని చంద్రబాబు అంటుంటే మంత్రి అచ్చెన్నాయుడు పథకాలు అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మెయ్యాలి అంటున్నారని సతీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లకు వారు ఇచ్చిన హామీలు గుర్తు చేస్తున్నానని, నిరుద్యోగభృతి, అన్నదాత సుఖీభవ, 50 ఏళ్ళు దాటిన మహిళలకు పించను, ఫ్రీబస్సు, అడబిడ్డ నిది ఇచ్చారా అని సతీష్ రెడ్డి ప్రశ్నించారు. మీరు ఇచ్చిన గ్యాస్ సిలిండర్లు ఎంత మంది ఇళ్లకు చేరాయని గ్రామాలకు వెళ్లి అడుగుదాం రాండి అంటు సతీష్ రెడ్డి సవాల్ విసిరారు. ఇవన్నీ అమలు చేయకుండా మాపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయించి డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడుతున్నారని కూటమి నేతలపై సతీష్ రెడ్డి మండిపడ్డారు. అసలు ఆధారాలు లేకుండా కట్టు కధలు అల్లి కేసులు పెడుతున్నారని లక్ష కోట్లు అన్న లిక్కర్ కేసు చివరికి ఎన్ని కోట్లకు వచ్చిందని సతీష్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. వాస్తవానికి లిక్కర్ స్కామ్ మా హయాంలో జరగలేదని ఇప్పుడు జరుగుతోందని సతీష్ రెడ్డి ఆరోపించారు. ఒక్కో బాటిల్ పై పది రూపాయలు అదనంగా అమ్ముకుంటున్నారని చంద్రబాబు సర్కార్‌పై సతీష్ రెడ్డి ఆరోపించారు.
వైఎస్‌ఆర్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవిలు లోకేష్ గురించి మాట్లాడకూడదు అంటున్నారని మీ పార్టీకి లోకేష్ యువరాజు కావచ్చు… అయితే నాకేంటి అని సతీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. నేను టీడీపీకి ఎందుకు రాజీనామా చేశానన్న విషయం వాళ్ళకి తెలుసని నేను మాట్లాడుతుంటే భరించలేక లోకేష్ వాసు, బీటెక్ రవిలతో నన్ను తిట్టిస్తున్నాడని మండిపడ్డారు. బీటెక్ రవి భయపెడితే నేను భయపడిపోతానా, ఆయన ఏరకమైన బాష మాట్లాడతాడో నా నుంచి అదే రకమైన బాషలో సమాధానం ఉంటుందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా ప్రవర్తించిన వాళ్లంతా అధికారం కోల్పోయాక ఏమైపోయారో గుర్తు చేసుకోమని వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు సతీష్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.