YSRCP : పాలకుల విధానాలతో వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది
వైయస్ఆర్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి;
- అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని నిలువునా పాతరేస్తున్నారు
- ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేస్తున్న ధోరణులు ప్రమాదకరం
- పులివెందుల ఎన్నికలు జరిగిన తీరుతో ప్రజాస్వామ్యవాదుల్లో ఆందోళన
- ఇప్పటికే ఈవీఎంలు మేనేజ్ చేసి గెలుస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది
- ఉప ఎన్నికల్లో అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరింది
అధికారమే పరమావధిగా వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్న పాలకుల కారణంగా ప్రజాస్వామ్యం పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని వైయస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసి, తమ ప్రతినిధులను ఎన్నుకునే స్వేచ్ఛను, స్వాంతంత్య్రాన్ని కూడా కోల్పోయేలా నేటి పాలకులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత ప్రమాదకరమని అన్నారు. గత ఏడాది జరిగిన జనరల్ ఎలక్షన్, తాజాగా జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలను చూస్తే ఎంతగా వ్యవస్థలను నాశనం చేస్తూ, బరితెగించి ప్రజాస్వామిక స్పూర్తిని దెబ్బ తీస్తున్నారో అర్థమవుతుందని అన్నారు. ప్రజాస్యామ్యాన్ని కాపాడుకునేందుకు పౌరులు, మేధావులు, విజ్ఞులు ముందుకు రావాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే...
ఈవీఎంలపై ప్రజల్లో అనుమానాలు
తాత్కాలిక అవసరాల కోసం వ్యవస్థలను వాడుకోవడం మన రాష్ట్రంలో కళ్ల ముందే కనిపిస్తోందని సజ్జల ఆరోపించారు. ఏడాది కాలంగా రాష్ట్రంలో జరిగిన పాలన గమనిస్తే అధికారం కోసం ఎలాంటి హామీలైనా ఇవ్వొచ్చు అధికారంలోకి వచ్చాక అవసరం లేదని పక్కకు తోసేయొచ్చనే బాధ్యతారహిత్యం కనిపిస్తోందన్నారు. యంత్రాలను మేనేజ్ చేసి ఏమైనా చేయొచ్చనే అభిప్రాయం ఈవీఎంల విషయంలో దేశంలో బలపడిందిన్నారు. ప్రజల నుంచి వ్యక్తమవుతున్న అనుమానాలకు సమాధానం ఉండటం లేదని మన రాష్ట్రంలోనే ఓటింగ్ నిర్వహించిన విధానంపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నారు. ఓటింగ్ పూర్తయిన రోజు ప్రకటించిన ఎన్నికల శాతానికి తుది వివరాలు ఇచ్చిన దానికి ఓటింగ్ శాతంలో 12.5 శాతం తేడా ఎలా వచ్చిందని సజ్జల ప్రశ్నించారు. దాదాపు 50 లక్షలకు పైగా ఓట్లు తేడా ఉన్నాయని అడుగుతుంటే సమాధానం చెప్పే వ్యవస్థ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మొన్న జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కేవలం 10 వేల ఓట్లు, 15 బూత్‌ల కోసం 2 వేల మంది పోలీసులను మోహరించారు. ఏ ఒక్క వైయస్సార్సీపీ ఏజెంట్‌ను కూడా బయటకు రానీయలేదు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే చోద్యం చూస్తూ కూర్చున్నారు. దీనిని వ్యతిరేకస్తూ మేం తలపడి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ.. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని, ప్రజల ప్రాణాలు ముఖ్యమని భావించిన పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. ఓటర్లలో 50 శాతంగా ఉన్న మహిళలు క్యూలైన్లలో ఎక్కడైనా కనిపించారా? ఎన్నికల సందర్భంగా ఏమేం అరాచకాలు జరిగాయో సీసీ టీవీ ఫుటేజ్‌లు తీస్తే మొత్తం బయటపడిపోతుంది. ఈసీ కనీసం ఆ పని చేయలేదు. ఎన్నికల అరాచకాలపై మేం కోర్టు మెట్లెక్కితే ఆధారాలు తీసుకురావాలని కోరుతుందేమో అనుకున్నాం కానీ దురదృష్టవశాత్తు అదీ జరగలేదు. అయినా న్యాయ వ్యవస్థమీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.