రామకుప్పం ఎంపీటీసీ ఎన్నిక వాయిదా వేయండి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలంసాహ్నికి వైసీపీ వినతి;
రామకుప్పం ఎంపీటీసీ ఉప ఎన్నికను వాయిదా వేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసి విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైఎస్‌ఆర్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్‌రెడ్డి, నారాయణ మూర్తిలు శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలంసాహ్నిని కలసి ఈమేరకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్ధల ఎన్నికలు జరిగే చోట జాగ్రత్తలు తీసుకోవాలని గతంలోనే మేము రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ని కోరామని, ఈ ప్రభుత్వం సక్రమంగా ఎన్నికలు జరిపించే పరిస్ధితుల్లో లేదని ఫిర్యాదు చేశామని అనుకున్నట్లుగానే రామకుప్పం ఎంపీటీసీ అభ్యర్థి అయిన దళిత మహిళ శ్రీదేవిని నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని చెప్పారు. శ్రీదేవి బ్యాగ్ లాక్కుని ఆందులో ఉన్న విలువైన డాక్యుమెంట్లు, నామినేషన్ పత్రాలు లాక్కున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు చోద్యం చూస్తున్నారు తప్పి అడ్డుకోలేదని, పైపెచ్చు ఫిర్యాదు చేసినా తీసుకోవడం లేదని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీయం సొంత నియోజకవర్గంలోనే ప్రజాస్వామ్యం అమలు కావడం లేదని ఆరోపించారు. బీహార్ తరహా పరిస్ధితులు ఏపీలో నెలకొన్నాయని విమర్శించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం స్థానంలో లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని వైసీపీ నేతలు అన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరపకపోతే న్యాయపోరాటం చేస్తామని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు హెచ్చరించారు.