CM Chandrababu: గోదావరి జలాలతో నిండుకుండలా ప్రకాశం బ్యారేజీ.. పరిశీలించిన సీఎం చంద్రబాబు
పరిశీలించిన సీఎం చంద్రబాబు
CM Chandrababu: గోదావరి నీటి పరవళ్లతో నిండుకుండలా కళకళలాడుతున్న ప్రకాశం బ్యారేజీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం పరిశీలించారు. విజయవాడలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొని ఉండవల్లి నివాసానికి తిరిగి వెళ్తున్న సమయంలో దారిలో ఆగి బ్యారేజీని సందర్శించారు. గోదావరి నీటి రాకతో నిండుకుండలా ఉన్న బ్యారేజీని, బంగారు రంగులోకి మారిన కృష్ణా నీటిని కొంతసేపు గమనించారు.
పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఈ సీజన్‌లో ఇప్పటివరకు 17.52 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు విజయవంతంగా తరలించామని సీఎం తెలిపారు. కృష్ణా తూర్పు ప్రధాన కాలువ నుంచి 3,928 క్యూసెక్కులు, పశ్చిమ ప్రధాన కాలువ నుంచి 3,115 క్యూసెక్కులు, గుంటూరు ఛానల్ నుంచి 115 క్యూసెక్కులు.. మొత్తం 7,158 క్యూసెక్కుల నీటిని సాగు కోసం విడుదల చేస్తున్నామని అధికారులు వివరించారు.
ఎల్‌నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పట్టిసీమ నీరు పంటలకు జీవం పోస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘సమర్థ నీటి నిర్వహణతో ఎల్‌నినో పరిస్థితుల్ని ఎదుర్కొంటాం. రైతులకు సాగునీటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం’’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. సమర్థ నీటినిర్వహణ ద్వారా సాగునీటి సమస్యలను అధిగమించాలని అధికారులకు సూచించారు.