MLA Damacharla Janardhan: బాలినేని జనసేనలో చేరి వైకాపాకు పని చేస్తున్నారు: ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తీవ్ర విమర్శ
ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తీవ్ర విమర్శ
MLA Damacharla Janardhan: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరినా వైకాపా (వైఎస్సార్‌సీపీ)కి కోవర్టుగా పనిచేస్తున్నారని, కూటమిలో విభేదాలు సృష్టించేందుకే వ్యాఖ్యలు చేస్తున్నారని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తీవ్రంగా విమర్శించారు. ఆదివారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి బాలినేని ఇటీవలి వ్యాఖ్యలను ఖండించారు.
బాలినేని చేసిన తప్పులు ముద్రిస్తే కరపత్రాలే కాదు, పుస్తకాలు కూడా సరిపోవని జనార్దన్ అన్నారు. “అమావాస్య, పౌర్ణమికి ఒకసారి ఒంగోలు వచ్చి నాపై వ్యక్తిగతంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కూటమిలో ఉన్నాం కాబట్టి మౌనంగా ఉంటున్నాం. వైకాపా ప్రభుత్వంలో నాపై 79 అక్రమ కేసులు బనాయించారు. జనసేనలోకి వెళ్లకుండా ఉంటే అతను చేసిన పాపాలకు జైలుకు వెళ్లేవారు” అని ఆయన అన్నారు.
బాలినేని కుమారుడు ప్రణీత్‌రెడ్డి విద్యార్థులకు గంజాయి అలవాటు చేశారని, గత ప్రభుత్వంలో బారు షాపులు సిండికేట్ చేసి కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. “గత ప్రభుత్వంలో చేసినట్లుగా కూటమి ప్రభుత్వంలో రౌడీయిజం చేయాలంటే కుదరదు. ఒంగోలులోనే ఉండాలని వెయ్యి సార్లు చెప్పా. రెండు నెలలకోసారి వచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు” అని జనార్దన్ స్పష్టం చేశారు.
బాలినేని అవినీతి, అక్రమాలపై కాణిపాకంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమని, మీరు కూడా వస్తారా అని సవాల్ విసిరారు. వయస్సు పెరిగే కొద్దీ ప్రెస్టేషన్ పెరుగుతున్నట్టుందని, కొడుక్కి జనసేనలో పదవి రాదనే భయంతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. వియ్యంకుడు విల్లాలో ప్రభుత్వ భూమి విషయంలో బాలినేని ప్రకటన ఏమైందని కూడా ప్రశ్నించారు.
ప్రజలు ఘోరంగా ఓడించినా నిస్సిగ్గుగా మాట్లాడటం హాస్యాస్పదమని, ఐదుసార్లు గెలిచి సాధించిన అవినీతికి గుణపాఠం చెప్పినా తీరు మార్చుకోకపోవడం సిగ్గు చేటని జనార్దన్ అన్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. ఈ సమావేశంలో పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఏఎంసీ చైర్మన్ ఆర్. వెంకట్రావు పాల్గొన్నారు.