North Costal Projects : ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు ప్రాధాన్యత
సమీక్ష సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు;
- తాగు సాగునీరు సమస్య పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక
- వారంలో ముఖ్యమంత్రి ప్రత్యేక సమీక్ష
ఉత్తరాంధ్ర ప్రజలకు సాగు, తాగు నీరందించే లక్ష్యంతో పెండింగ్ ప్రాజెక్టులను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. గురువారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే వారం ముఖ్యమంత్రి స్వయంగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై, వాటికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై ప్రత్యేక సమీక్ష నిర్వహించబోతున్నట్లు మంత్రి అధికారులకు తెలియజేశారు. 2014- 19 కాలంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రయోజనార్థం అనేక ప్రాజెక్టులను మంజూరు చేయడమే కాకుండా చాలావరకు పూర్తి చేసిందని రామానాయుడు గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం చేపట్టిన పనులు అన్నిటిని గాలికి వదిలేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో ఈ పెండింగ్ ప్రాజెక్టులు అన్నింటిని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి చెప్పారు. ఇవన్నీ పూర్తయితే ఉత్తరాంధ్ర ప్రజలకు తాగు, సాగునీరు సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందన్నారు.
90శాతం పనులు పూర్తైన వంశధార స్టేజ్-2, ఫేజ్-2 మరియు తోటపల్లి బ్యారేజ్ పనులను గత ప్రభుత్వం గాలికొదిలేయడం దుర్మార్గమన్నారు. వంశధార- నాగావళి మరియు నాగావళి-చంపావతి అనుసంధానం బ్యాలెన్స్ పనులపై మంత్రి సమీక్షించారు. ప్రస్తుత స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. హీరమండలం లిఫ్ట్, మద్దువలస స్టేజ్-2, జంజావతి రిజర్వాయర్ పనులు పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జైకా నిధులతో నత్తనడకన సాగుతూ నిలిచిపోయిన ఆండ్ర రిజర్వాయర్, రైవాడ, పెద్దంకలం, పెద్దగడ్డ, వట్టిగెడ్డ, పూర్తిచేయడానికి ఉన్న అవాంతరాలపై ఆరా తీశారు . ముఖ్యమంత్రి సమీక్ష నాటికి ఏ ఏ పనులకు ఎంతెంత ప్రాధాన్యం ఇవ్వాలి… ఎంత కాలంలో పూర్తి చేయగలం, తదితర వివరాలతో సమగ్ర నివేదికలతో సిద్ధంగా ఉండాలని సంబంధిత అధికారులకు, ఇంజనీర్లకు మంత్రి రామానాయుడు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సి, నరసింహమూర్తి, వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల సీఈలు, ఎస్ ఈలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.